Presidents G20 Dinner: జీ20 సదస్సు: రాష్ట్రపతి విందుకు హాజరైన ప్రతిపక్ష సీఎంలు వీరే..!
- అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ఆహ్వానం
- ప్రతిపక్షాల నుంచి బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- విందులో అమర్చిన టేబుల్స్ కు దేశంలోని నదుల పేర్లు
జీ20 సదస్సు కోసం వచ్చిన సభ్య దేశాల అధినేతలతో పాటు ఇతర అతిథులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ విందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇతర నేతలకు కూడా రాష్ట్రపతి ఆహ్వానం పంపారు. అయితే, ప్రతిపక్ష కూటమికి చెందిన ముఖ్యమంత్రులలో కొందరు మాత్రమే విందుకు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు వచ్చారు. ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఢిల్లీ, రాజస్థాన్ ముఖ్యమంత్రులు భూపేంద్ర భాఘెల్, నవీన్ పట్నాయక్, అర్వింద్ కేజ్రీవాల్, అశోక్ గెహ్లాట్ తదితరులు గైర్హాజరయ్యారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, అసోం సీఎం హేమంత్ బిశ్వ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విందుకు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ లో ఈ విందు కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం వేసిన టేబుళ్లకు దేశంలోని నదుల పేర్లు పెట్టారు. కృష్ణ, యమున, బ్రహ్మపుత్ర, గంగా తదితర పేర్లు పెట్టారు.