rajaiah: రాజయ్యకు నేను అండగా నిలబడ్డా... ఆయన నా గెలుపుకు సహకరిస్తారు: కడియం శ్రీహరి

Kadiyam Srihari urges Rajaiah help for winnng in next election

  • రాజయ్యకు రెండుసార్లు అవకాశమిచ్చిన అధిష్ఠానం ఈసారి తనకు ఇచ్చిందన్న కడియం
  • తన విజయానికి రాజయ్య కృషి చేస్తారనే నమ్మకం ఉందని వ్యాఖ్య
  • తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవని స్పష్టీకరణ

ఎమ్మెల్యే రాజయ్యకు తాను గతంలో అండగా నిలబడ్డానని, ఇప్పుడు పార్టీ తనకు టిక్కెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో తన విజయానికి సహకరిస్తాడని భావిస్తున్నానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రెండుసార్లు రాజయ్యకు పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు ఆయన విజయానికి కృషి చేశానన్నారు.

ఎమ్మెల్యే రాజయ్యకు పార్టీ అధిష్ఠానం రెండుసార్లు అవకాశం ఇచ్చిందని, తాను బీఆర్ఎస్ పార్టీలో చేరాక ఆయనకు అండగా నిలబడ్డానని చెప్పారు. రేపు జరగబోయే ఎన్నికల్లోను పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని భావిస్తున్నానని చెప్పారు. ఆయన కూడా ఇప్పుడు తన విజయానికి సహకరిస్తారనే నమ్మకంతో ఉన్నానన్నారు. తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవని, ప్రజల శ్రేయస్సు, నియోజకవర్గ అభివృద్ధే తన అజెండా అన్నారు.

2023 చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను పార్టీ ప్రకటించిందని, ఈ నియోజకవర్గ ప్రజలు కూడా తనను గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. పార్టీలోని నాయకుల సహకారం, ప్రజల మద్దతుతో ఈ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. తెలంగాణలో ఇటీవలి వరకు పాలపొంగులా కనిపించిన బీజేపీ, ఇప్పుడు పూర్తిగా కిందకు పడిపోయిందన్నారు. తెలంగాణలో మూడు నాలుగు సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. నిన్నటి దాకా అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. కాంగ్రెస్ పరిస్థితి అదే రకంగా ఉందన్నారు. ఆ పార్టీ కప్పల తడక అన్నారు. అలిగిన నేతను బుజ్జగించే వరకు మరొకరు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తారన్నారు.

  • Loading...

More Telugu News