Stalin: సనాతన ధర్మం వివాదం.. ఏ మతాన్ని ఉదయనిధి కించపరచలేదని స్టాలిన్
![Stalin letter amit Udayanidhi comments on Sanatana Dharmam](https://imgd.ap7am.com/thumbnail/cr-20230907tn64f9a55eb0107.jpg)
- సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధి
- సనాతన ధర్మం సూత్రాలు వివక్షకు గురి చేస్తున్నాయని మాత్రమే ఉదయనిధి చెప్పాడని స్టాలిన్ వ్యాఖ్య
- ఉదయనిధి వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారని విమర్శ
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సినీ నటుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. డెంగీ, మలేరియా మాదిరి సమాజాన్ని వేధిస్తున్న సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించాలని తన సహచరులకు ప్రధాని మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి తండ్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై గట్టిగా స్పందించాలని తన సహచర మంత్రులకు మోదీ చెప్పారంటూ జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను చూసి నిరుత్సాహానికి గురయ్యానని ముఖ్యమంత్రి చెప్పారు. ఉదయనిధి ఏమన్నాడనే సమాచారాన్ని మోదీ తెప్పించుకుని అసలు విషయాలను తెలుసుకోవాలని సూచించారు. సనాతన ధర్మంలో ఉన్న అసమానతలను రూపుమాపే ధైర్యం బీజేపీకి లేదని విమర్శించారు.