ITC: ప్యాకెట్‌లో ఒక్క బిస్కెట్ తక్కువైందని రూ.లక్ష పరిహారం చెల్లించాలంటూ కోర్టు తీర్పు!
- తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో ఘటన
- ఐటీసీ సంస్థకు చెందిన ‘సన్‌ఫీస్ట్ మేరీ లైట్’ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేసిన వినియోగదారుడు
- ప్యాకెట్‌లో 16కు బదులు 15 బిస్కెట్లే ఉండటంతో వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు
- ప్యాకెట్ బరువును బట్టి అమ్మకాలు జరుపుతామని వాదించిన ఐటీసీ
- నిబంధనలు ఉల్లంఘించలేదని నిరూపించేందుకు విఫలయత్నం
- ఐటీసీ వాదనను తిరస్కరించిన కోర్టు
- బాధితుడికి రూ. లక్ష పరిహరం, కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు
ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ ఐటీసీకి తమిళనాడులోని ఓ వినియోగదారుల కోర్టు భారీ షాకిచ్చింది. సంస్థ తయారు చేసిన ఓ బిస్కెట్ ప్యాకెట్‌లో ఒకేఒక బిస్కెట్ తక్కువైనందుకు వినియోగదారుడికి రూ. లక్ష పరిహారం చెల్లించాలంటూ తాజాగా తీర్పు వెలువరించింది.
తిరువళ్లూర్ జిల్లాకు చెందిన దిల్లీబాబు అనే వ్యక్తి ఐటీసీ తయారు చేసిన సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. అయితే, ప్యాకెట్‌లో 16 బిస్కెట్లు ఉంటాయని ర్యాపర్‌పై ముద్రించగా లోపల మాత్రం 15నే కనిపించాయి. దీంతో, అతడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. కంపెనీ అన్యాయం చేస్తోందని, సేవల్లో లోపం ఉందని ఆరోపించాడు. కంపెనీపై రూ.100 కోట్ల పెనాల్టీ వేయాలని, ఆ ప్యాకెట్ అమ్మిన దుకాణం తనకు రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలని కేసు దాఖలు చేశారు.
ఐటీసీ మాత్రం తాము తప్పు చేయలేదని వాదించే ప్రయత్నం చేసింది. బిస్కెట్ ప్యాకెట్‌లను వాటి బరువును బట్టి అమ్ముతామని, బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదని వివరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 నుంచి 100 గ్రాముల బరువుండే ఆహార ప్యాకెట్ల విషయంలో ర్యాపర్‌పై ముద్రించిన బరువులో 4.5 గ్రాముల వరకూ ఎక్కువ తక్కువలు ఉన్నా తప్పులేదని చెప్పింది. తమ ప్యాకెట్‌పై 76 గ్రాములని ముద్రించగా, వాస్తవ బరువు 71.5 గ్రాములని వెల్లడించింది. కాబట్టి నిబంధనల ప్రకారం ఒక ప్యాకెట్ బరువు 71.5 నుంచి 80.5 గ్రాముల మధ్య ఉండొచ్చని పేర్కొంది.
కానీ కోర్టు మాత్రం ఐటీసీ వాదనలను తోసిపుచ్చింది. ప్యాకెట్‌పై ముద్రించిన సమాచారం కస్టమర్లను ప్రభావితం చేస్తుందని వివరించింది. ఆ ప్యాకెట్‌లో 16 బిస్కెట్లు ఉంటాయని ముద్రించినప్పుడు ఆ మేరకు ఉండాల్సిందేనని తీర్పు చెప్పింది. అంతేకాకుండా, ఆ బిస్కెట్ ప్యాకెట్‌కు చెందిన బ్యాచ్ అమ్మకాలను మొత్తం నిలిపివేయాలని ఆదేశించింది. బాధితుడికి రూ. లక్ష పరిహారం చెల్లించడంతో పాటూ కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పింది. అయితే, ప్యాకెట్ అమ్మిన షాపునకు మాత్రం ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది.