Telangana: తెలంగాణ వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన సీఎస్
- రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ
- జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమీక్ష
- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశాలు
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపినందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. టెలి కాన్ఫరెన్స్లో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ కుమార్, అరవింద్ కుమార్, సునీల్ శర్మ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నిండిపోయాయని, గండ్లు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాజ్ వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద ముందస్తు జాగ్రత్త చర్యగా తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అన్ని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సహాయక శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.