Vivek Ramaswamy: మా గొడవలు చిన్నవే.. ట్రంప్‌తో విభేదాలపై వివేక్ రామస్వామి స్పందన
- అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి
- డెమాక్రెటిక్ పార్టీ తరపున బరిలోకి, పార్టీ అభ్యర్థిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ
- ఇటీవల స్థానిక టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ
- స్వల్ప భేదాభిప్రాయాలు మినహా విధానపరమైన అంశాల్లో తమది ఏకాభిప్రాయమేనని స్పష్టీకరణ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న భేదాభిప్రాయాలు చిన్నవేనని వివేక్ రామస్వామి వ్యాఖ్యానించారు. విధానపరమైన విషయాల్లో తమ మధ్య 90 శాతం ఏకాభిప్రాయం ఉందని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అమెరికాకే తొలి ప్రాధాన్యమిచ్చే తామిద్దరి మధ్య పోటీ నెలకొందని పేర్కొన్నారు.
‘‘మా ఆలోచనలను పంచుకోవడం ద్వారా దేశాన్ని ఏకం చేసే అవకాశం మా ముందు ఉంది. గతంలో ట్రంప్ వేసిన పునాది నుంచి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళతా. పాలసీ విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. అయితే, మా మధ్య స్వల్ప విభేదాలు ఉన్న మాట వాస్తవం. నేను అధికారంలోకి వస్తే దేశ విద్యాశాఖను మూసేస్తా. దక్షిణ సరిహద్దు వద్ద సైన్యాన్ని మోహరిస్తా’’ అని వివేక్ తన ఆలోచనలను పంచుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే వివేక్‌పై ప్రశంసలు కురిపించారు. వివేక్ చాలా చాలా ఇంటెలిజెంట్ అని పొగిడిన ట్రంప్, ఆయన తన ప్రభుత్వంలో గొప్ప ఉపాధ్యక్షుడు కాగలడని కూడా కితాబిచ్చారు. వివేక్ మాత్రం తనకు ఉపాధ్యక్ష పదవి చేపట్టే అలోచనే లేదని గతంలోనే పలు మార్లు స్పష్టం చేశారు.