BCCI: బీసీసీఐకి మళ్లీ కాసుల పంట.. మూడేళ్లకు రూ. 235 కోట్లు చెల్లించనున్న ప్రైవేట్ బ్యాంక్
- బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు చేజిక్కించుకున్న ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్
- స్వదేశంలో జరిగే మ్యాచ్‌లకు మూడేళ్ల కాలానికి హక్కుల కొనుగోలు
- ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కు రూ.4.20 కోట్లు
ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మరోసారి కోట్ల వర్షం కురిసింది. కొత్త టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల ద్వారా వచ్చే మూడేళ్లలో బోర్డుకు రూ.235 కోట్లు చేరనున్నాయి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ స్వదేశంలో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్ ల టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులు సొంతం చేసుకుంది. బీసీసీఐ నిర్వహించబోయే అంతర్జాతీయ (సీనియర్ పురు షుల, మహిళల) మ్యాచ్ లతో పాటు దేశవాళీ టోర్నీలు, అండర్-19, అండర్-23 టోర్నీలకు ఈ హక్కులు వర్తిస్తాయి.
కొత్త ఒప్పందం ప్రకారం ఐడీఎఫ్సీ ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కు బీసీసీఐకి రూ. 4 కోట్ల 20 లక్షలు చెల్లించనుంది. భారత్ లో రాబోయే మూడేళ్ల వ్యవధిలో మొత్తం 56 అంతర్జాతీయ మ్యాచ్ లు జరగనున్నాయి. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ తో మొదలయ్యే ఒప్పందం 2026 ఆగస్టు వరకు అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందానికి ముందు వరకు టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న 'మాస్టర్ కార్డ్' ఒక్కో మ్యాచ్ కు రూ.3 కోట్ల 80 లక్షలు బీసీసీఐకి చెల్లించింది.