Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరిస్తే ఏమిటి మార్గం..?
- పాలసీ తీసుకునే ముందు సమగ్ర సమాచారం ఇవ్వాలి
- ఆరోగ్యం, చేసే పనికి సంబంధించిన వాస్తవాలు వెల్లడించాలి
- లేదంటే తర్వాత తిరస్కరణల ముప్పు
- సహేతుకంగా లేదనిపిస్తే పరిష్కారానికి ప్రయత్నించొచ్చు
జీవిత బీమా అయినా, ఆరోగ్య బీమా అయినా అవసరంలో ఆదుకున్నప్పుడే దానికి విలువ ఉంటుంది. ఏటా అంత ప్రీమియం చెల్లించి పాలసీ తీసుకున్నప్పటికీ, కీలకమైన సమయాల్లో పరిహారం చెల్లించకుండా, క్లెయిమ్ ను బీమా కంపెనీలు తిరస్కరిస్తుంటాయి. దీంతో పాలసీదారులకు ఏం చేయాలో పాలు పోదు. కానీ, దీనికంటూ ఓ విధానం ఉంది. తమ క్లెయిమ్ ను బీమా సంస్థలు తిరస్కరిస్తే ఏం చేయాలన్న దాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరం.
క్లెయిమ్ పత్రాలు సమగ్రంగా ఉంటే బీమా సంస్థలు దాదాపుగా తిరస్కరించవు. అయినా కానీ, కొన్ని సమయాల్లో తిరస్కరణలు చోటు చేసుకోవచ్చు. దీనికి పాలసీ తీసుకునే సమయంలో సమగ్రమైన వివరాలు, నిజాలు వెల్లడించకపోవడం ఒక కారణం. తమ ఆరోగ్యం, తాము చేస్తున్న వృత్తి లేదా ఉద్యోగం గురించి అసలు వివరాలు వెల్లడించకపోవడం కూడా కారణాలుగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో బీమా సంస్థలు క్లెయిమ్ తిరస్కరించడానికే పరిమితం కావు. పాలసీని రద్ధు కూడా చేస్తాయి. పాలసీ తీసుకునే సమయంలో వెల్లడించిన సమాచారానికి, ప్రస్తుతం క్లెయిమ్ రూపంలో వచ్చిన సమాచారానికి పొంతన లేకపోతే అప్పుడు రద్ధుకు మొగ్గు చూపిస్తాయి. అందుకే పాలసీ తీసుకునే ముందు సమగ్ర వివరాలు ఇవ్వాలి. అవసరమైతే మెడికల్ పరీక్షలకు వెళ్లాలి.
జీవిత బీమా పాలసీలో అయితే మూడేళ్లు నిండిన తర్వాత ఏ కారణం తోనూ (సమాచారంలో మోసం చేసినా) క్లెయిమ్ తిరస్కరించడానికి వీల్లేదని ఐఆర్డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అదే ఆరోగ్య బీమాలో అయితే ఎనిమిదేళ్లు నిండిన తర్వాత ముందస్తు వ్యాధుల సమాచారాన్ని కప్పి పెట్టారని క్లెయిమ్ తిరస్కరించడానికి కుదరదు.
తమ క్లెయిమ్ తిరస్కరణ సహేతుకంగా లేదని పాలసీదారులు భావిస్తే అప్పుడు ఇన్సూరెన్స్ అడ్వైజర్లు లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా తీసుకోవచ్చు. భేషక్ డాట్ ఓఆర్జీ సంస్థ సైతం సలహాలు అందిస్తోంది. నిపుణులను సంప్రదించి క్లెయిమ్ తిరస్కరణకు సరైన కారణాలు ఉన్నాయా? లేదా అని నిర్ధారించుకోవాలి. క్లెయిమ్ కు చెల్లింపులు వస్తాయా? లేదా అన్నది నిపుణులు చెబుతారు. దాని ప్రకారం ముందుకు వెళ్లాలి.
తొలుత బీమా సంస్థ ఫిర్యాదుల పరిష్కార విభాగానికి లిఖిత పూర్వకంగా రాయాలి. ప్రతి బీమా సంస్థలోనూ గ్రీవెన్స్ ఆఫీసర్ ఉంటారు. ఫిర్యాదు దాఖలు చేసిన 15 రోజులు నిండిన తర్వాత కూడా సహేతుక స్పందన రాకపోతే, అప్పుడు ఐఆర్డీఏఐ పోర్టల్ లో ఫిర్యాదు దాఖలు చేసుకోవాలి. అయినా పరిష్కారం కాకపోతే బీమా అంబుడ్స్ మన్ లో ఫిర్యాదు నమోదు చేయాలి. అక్కడా న్యాయం లభించకపోతే కోర్టును ఆశ్రయించొచ్చు.