Sarvey Sathyanarayana: అల్లుడిపైనే కాదు... అవసరమైతే కొడుకుపైనా పోటీ చేస్తా: కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ

Sarve Satyanarayana ready to contest from contonment

  • పదేళ్లు బీఆర్ఎస్‌కు అవకాశమిచ్చారు.. ఈసారి సోనియాకు ఓటేయాలని విజ్ఞప్తి
  • దరఖాస్తు చేసుకోవాలని తనకు ఢిల్లీ నుండి ఫోన్ వచ్చిందని వెల్లడి
  • తన అల్లుడు బీఆర్ఎస్ నుండి బరిలోకి దిగినా తాను కాంగ్రెస్ నుండి పోటీ చేస్తానన్న సర్వే
  • చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ రావడంపై క్లారిటీ

రానున్న ఎన్నికల్లో తాను కంటోన్మెంట్ నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నానని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. చాలా రోజుల తర్వాత శుక్రవారం ఆయన గాంధీ భవన్‌కు వచ్చారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని, ఆ తల్లికి ఈసారి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్ళు బీఆర్ఎస్‌కు అధికారం ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్‌కు అవకాశమివ్వాలన్నారు. తాను లోక్ సభకు పోటీ చేద్దామని భావించానని, కానీ ఢిల్లీ నుండి దరఖాస్తు చేయాలని తనకు ఫోన్ వచ్చిందన్నారు. అందుకే వచ్చి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. 

తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా చర్యలు ఉంటాయా? అని ప్రశ్నించారు. సోనియా తల్లివంటివారని, అలాంటి తల్లిని విడిచి ఎలా వెళ్తానన్నారు. తన అల్లుడు బీఆర్ఎస్ నుండి పోటీ చేసినా తాను మాత్రం కాంగ్రెస్ నుండి బరిలోకి దిగుతానని చెప్పారు. అవసరమైతే పార్టీ కోసం కొడుకుపై కూడా పోటీ చేస్తానన్నారు.
కాగా, చాలా రోజుల తర్వాత గాంధీ భవన్‌కు రావడంపై ఆయన స్పందిస్తూ... తనను సస్పెండ్ చేసిన వాళ్లను తీసేసే వరకు గాంధీ భవన్‌కు రానని, గతంలో చెప్పానని, ఇప్పుడు వాళ్లు లేరు కాబట్టి తాను వచ్చానని స్పష్టతనిచ్చారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఈరోజు చివరి రోజు కావడంతో చాలామంది ఆశావహులు గాంధీభవన్‌కు వచ్చారు. ఇప్పటి వరకు 800కు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాలలో కూడా దరఖాస్తు చేస్తున్నారు. 2004, 2009లో నిజామాబాద్ లోక్ సభ నుండి గెలిచిన మధుయాష్కీ ఈసారి ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడి నుండి ఆయన దరఖాస్తు చేశారు. హుజూరాబాద్ నుండి బల్మూరి వెంకట్, కంటోన్మెంట్ నుండి సర్వే సత్యనారాయణ, మధిర నుండి మల్లు భట్టి విక్రమార్క దరఖాస్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News