junk foods: పిల్లలకు ఈ ఆహారం విషంతో సమానమే..!

popular junk foods that are ruining your childs health

  • బర్గర్లు, పిజ్జాలు, స్నాక్స్ తో మహా ముప్పు
  • కూల్ డ్రింక్స్, సోడాలు, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ తోనూ నష్టమే
  • నూడుల్స్, పొటాటో చిప్స్ కూడా వద్దు
  • పండ్లను తినిపించడమే అన్నింటికంటే మంచి ఆప్షన్

ఆహార నియమాలు నేటి తరానికి పెద్దగా పట్టడం లేదు. రుచికరమైన, జంక్ ఫుడ్ పట్ల ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే హానిపై అవగాహన ఉండడం లేదు. జంక్ ఫుడ్ లో చక్కెరలు, ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల డోపమైన్ హార్మోన్ విడుదల అవుతుంది. దాంతో అలాంటి ఆహారమే మరింత తినాలని అనిపిస్తుంటుంది. 

ఒకదాని తర్వాత ఒకటి చొప్పున స్వీట్లు, బిస్కెట్లు, బర్గర్లు, చాక్లెట్లు తినాలనిపిస్తుంది. కానీ, అదే రోటీ, దాల్, పండ్లు అయితే  కొంచెం తిని ఆపేస్తాం. అవి జంక్ ఫుడ్ మాదిరిగా అంత రుచిగా ఉండవు. ఇక్కడే మంచికి, చెడుకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. జంక్ ఫుడ్ లో పీచు ఉండదు. వాటితో ముఖ్యమైన, సహజ పోషకాలు అందవు. చిన్నారుల సహజ భౌతిక, మానసిక ఎదుగుదలకు అవి ఉపయోగపడవు. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉంచాలి. 

బ్రేక్ ఫాస్ట్
బ్రేక్ ఫాస్ట్ కింద బ్రెడ్, కేక్ లు, ప్యాస్ట్రీలు వంటివి ఇవ్వొద్దు. వీటిల్లో చక్కెరలు, కేలరీలు ఎక్కువ. పోషకాలు తక్కువ. సందేహం వస్తే వాటిలోని ఇంగ్రేడియెంట్స్ ను చూడాలి.

 నూడుల్స్
ఇన్ స్టంట్ నూడుల్స్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిల్లో సోడియం ఎక్కువ. అవసరమైన పోషకాలు ఉండవు. పీచు ఉండదు. పైగా వీటిల్లో ఆరోగ్యానికి హాని చేసే కెమికల్స్ ఉంటాయి.

పొటాటో చిప్స్/ ఫ్రైడ్ ఫుడ్స్
లేస్, బింగో మాదిరి పొటాటో చిప్స్ తినని చిన్నారులు కనిపించరు. వీటిల్లో హానికారక అక్రిలమైడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది కేన్సర్ కారకం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, అధిక బరువు, మలబద్ధకం సమస్యలు వేధిస్తాయి. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లో అనారోగ్యాన్ని కలిగించే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే సోడియం, కేలరీలు కూడా ఎక్కువే. బరువు పెరగడం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వీటితో తెచ్చుకున్నట్టు అవుతుంది. వీటికి బదులు పాప్ కార్న్ ఇవ్వొచ్చు. ఇంట్లోనే పొటాటోతో వంటకం చేసి ఇవ్వొచ్చు.

 చికెన్ నగ్గెట్స్ 
చికెన్ నగ్గెట్స్ లేదా చికెన్ ఫింగర్స్ ను పిల్లలు ఇష్టంగా తింటుంటారు. ఇవి నూనెలో వేయించడం వల్ల రుచిగా ఉంటాయి. దీనికి బదులు ఇంట్లో చేసుకున్నవి తినిపించడం మంచిది. ఫాస్ట్ ఫుడ్ లో టెరిటియరీ బూటిల్ హైడ్రోక్వినోన్ (టీబీహెచ్ క్యూ) అనే అడిటివ్ ఉంటుంది. ఎక్కువగా తింటే దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అలాగే డైమెథిల్ పాలీసిలోక్సేన్ అనేది మరొక అడిటివ్. ఇది యాంటీ ఫోమింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. 

చక్కెర పానీయాలు
కూల్ డ్రింక్స్, సోడాలు, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ లో చక్కెరలు చాలా ఎక్కువ. పోషకాలు చాలా తక్కువ. ప్రమాదకర ఆర్టిఫీషియల్ చక్కెరలు ఉంటున్నాయి. వీటి వల్ల బరువు పెరగడం, మధుమేహం రిస్క్ ఉంటుంది. వీటికి బదులు ఇంట్లోనే చక్కెర కలపని పండ్ల రసం చేసుకుని ఇవ్వొచ్చు. పాల పదార్థాలు ఇవ్వొచ్చు.

 క్యాండీలు, స్వీట్లు
చాక్లెట్లు, స్వీట్లతో కేలరీలు చాలా ఎక్కువగా శరీరంలోకి చేరతాయి. దీనివల్ల బరువు పెరిగే సమస్య ఏర్పడుతుంది. పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినిపించడం మంచిది. 

ప్యాకేజ్డ్ స్నాక్స్
నేడు మార్కెట్లో రూ.5-20 రూపాయల మధ్య లభించే స్నాక్స్ ఏ మాత్రం ఆరోగ్యానికి  మంచివి కావు. వీటిని రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ తో చేస్తారు. వీటితో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్, బరువు పెరిగే ముప్పు కూడా ఉంటుంది. 

 బర్గర్లు, పిజ్జాలు
ఇక బర్గర్లు, పిజ్జాలు అసలు వద్దే వద్దు. వీటితో పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి బ్యాక్టీరియాకి ఇవి శత్రువులు. అధిక కేలరీల వల్ల బరువు పెరుగుతారు. గుండె జబ్బుల రిస్క్ కూడా ఏర్పడుతుంది. 

  • Loading...

More Telugu News