Nara Lokesh: నిన్న జగన్ మాటలు విన్న ఉద్యోగులు జీతం ఇస్తే చాలు అనుకున్నారట!: లోకేశ్

Lokesh take a dig at CM Jagan and YCP leaders

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • గన్నవరంలో భారీ బహిరంగ సభ
  • రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా జగన్ పట్టించుకోవడంలేదన్న లోకేశ్
  • రాష్ట్రంలో రైతులు లేని రాజ్యం ఏర్పడిందని వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇవాళ గన్నవరంలో లోకేశ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

రోజుకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సైకో జగన్ పాలనలో రైతులు లేని రాజ్యం ఏర్పడిందని అన్నారు. 

"ఒకే రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రోజుకి నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జగన్ ప్యాలెస్ లో పడుకున్నాడు. జగన్ పాలనలో 11 వరుస విపత్తులు వస్తే ప్యాలెస్ దాటి బయటకి రాలేదు. రైతు భరోసా, పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ రుణాలు, ధాన్యం కొనుగోళ్లు అన్ని నాశనం చేశాడు. జగన్ పాలనలో క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే, పవర్ హాలిడే. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల్ని ఆదుకోవడానికి ప్రతి ఏడాది రూ.20 వేలు ఇస్తాం" అని హామీ ఇచ్చారు.

ఒకటో తేదీన జీతమిస్తే చాలు

జగన్ నిన్న ఏపీ ఎన్జీఓలతో మీటింగ్ పెట్టుకున్నాడు. మీ సంతోషం, మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నాడు. ఒకటో తారీఖున జీతం ఇచ్చే దిక్కులేదు, 200 వారాలు అయినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జగన్ మాటలు విన్న ఉద్యోగస్తులు సొల్లు కబుర్లు ఆపి జీతం ఇవ్వు చాలు అనుకున్నారట! 

పోలీసులకు 4 సరెండర్స్, 8 టీఏ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జీపీఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బు సైతం కొట్టేశాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. 

ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా 15 శాతం కోత పెట్టాడు జగన్. జగన్ తెచ్చిన జీవో నెం.79 రద్దు చేస్తాం. అలవెన్స్ యధాతథంగా ఇస్తాం.

కృష్ణాజిల్లాను అభివృద్ధి చేసింది టీడీపీ!

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు, రోడ్ల విస్తరణ, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, శ్మశానాలు అభివృద్ధి, సాగు, తాగు నీటి ప్రాజెక్టులు నిర్మించింది టీడీపీ. విజయవాడలో వందల కిలోమీటర్ల వరద కాలువల పనులు చేపట్టాం. కృష్ణా వ‌ర‌ద ముప్పు త‌ప్పించేందుకు రూ.164 కోట్లతో కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టాం. 

4.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.4,909 కోట్లతో గోదావరి నీటిని పంపింగ్‌ చేసి కృష్ణా జిల్లాకు తరలించేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాం. ఆ పనులు నిలిచిపోయాయి. మనం పట్టిసీమ కడితే జగన్ దండగ అన్నాడు. ఇప్పుడు జగన్ కి మన పట్టిసీమే దిక్కైంది.

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా మార్చాం

దుర్గమ్మ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, రోడ్లు విస్తరణ చేసింది టీడీపీ. బందరు పోర్టుకి భూసేకరణ చేసి పనులు ప్రారంభిస్తే జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో నాలుగేళ్లు డ్రామా చేశాడు. బస్టాండులా ఉన్న విమానాశ్రయాన్ని ఆంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాం. వైసీపీ వాళ్ళకి కనీసం ఎయిర్ పోర్టు ముందు మొక్కలు పెంచడం కూడా రాదు. 

పేదలకు టిడ్కో ఇళ్లు నిర్మించింది మేమే. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకొని ఏళ్లుగా ఉంటున్న పేదలకు పట్టాలు ఇచ్చింది చంద్రబాబు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభిస్తే జగన్ ఆ పనులు ఆపేశాడు.

సాగర్ కాలువల ద్వారా గోదావరి జిలాలను తరలిస్తాం

టీడీపీ గెలిచిన వెంటనే చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేసి నాగార్జునసాగర్ కాలువల ద్వారా గోదావరి జలాలను తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ నియోజకవర్గ సాగుకి అంద‌జేస్తాం. తిరువూరు నియోజకవర్గ రైతాంగానికి జీవనాధారమైన పిట్టలవారి గూడెం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. 

ఎ.కొండూరులో కిడ్నీ బాధితులు పెరిగిపోయారు. ఇంటింటికీ సుర‌క్షిత‌మైన నీరు అందించి కిడ్నీ స‌మ‌స్య‌లు రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తాం. జిల్లాలో ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.

అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం

టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తాం. సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పేద‌లంద‌రికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. మామిడి, పత్తి, మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకుంటాం. పెడన చేనేత కార్మికుల‌ని ఆదుకునేందుకు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తాం. 

మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తాం. కృష్ణాడెల్టా చివరి ఆయకట్టు వరకు రైతాంగానికి సాగునీరు అందిస్తాం. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తాం. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. 

టీడీపీ కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. చట్టాలు అతిక్రమించి వ్యవహరించిన అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.

====

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2541.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 2.4 కి.మీ.*

*192వరోజు (23-8-2023) యువగళం వివరాలు*

*గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి కృష్ణాజిల్లా)*

సాయంత్రం

4.00 – చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాలు నుంచి పాదయాత్ర ప్రారంభం.

5.45 – ఆత్కూరులో కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులతో సమావేశం.

6.45 – పొట్టిపాడులో స్థానికులతో సమావేశం.

8.45 – అంపాపురం శివారు విడిది కేంద్రంలో బస.

******

Nara Lokesh
Gannavaram
Yuva Galam Padayatra
TDP
Jagan
YSRCP
  • Loading...

More Telugu News