Mynampally: మరోసారి సంచలన కామెంట్స్ చేసిన మైనంపల్లి

Malkajigiri Mla Mynampally Hanumanth Rao comments

  • మెదక్ లో తన కుమారుడు పోటీ చేయడం ఖాయమని వెల్లడి
  • మల్కాజిగిరి పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తేలేదన్న బీఆర్ఎస్ లీడర్
  • రెండు నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడాకే భవిష్యత్ కార్యాచరణ అంటూ ప్రకటన

తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ లో మైనంపల్లి రోహిత్ పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రోహిత్ పోటీ విషయంలో మాటకు కట్టుబడి ఉన్నానని, మాట తప్పేదిలేదని పేర్కొన్నారు. అదేవిధంగా మల్కాజిగిరిలో తాను కూడా బరిలో ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చి, తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంపై మైనంపల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సోమవారం తిరుమల చేరుకున్న మైనంపల్లి.. మంగళవారం కూడా అక్కడే ఉండిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో మైనంపల్లి హన్మంతరావుకు చోటుదక్కింది. అయితే, మెదక్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే కేటాయించారు. దీనిపై మైనంపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్ లో పోటీ చేయాలా వద్దా అనేది తన కుమారుడు రోహిత్ నిర్ణయానికే వదిలేశానని సోమవారం సాయంత్రం వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం దీనిపై మరోమారు మాట్లాడుతూ.. మెదక్ లో రోహిత్ పోటీ చేస్తాడని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News