Tollywood: ఇప్పటిదాకా లవర్ బాయ్​లా చూశారు.. ఇప్పుడు యాక్షన్ లుక్‌లో సర్‌‌ప్రైజ్ చేస్తా: దుల్కర్ సల్మాన్

will surprise in action look says Dulquer Salman
  • దుల్కర్ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోథా
  • ఈ నెల 25న విడుదల కాబోతున్న చిత్రం
  • వెంకీ అట్లూరి  దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ చేస్తున్న దుల్కర్
మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు దుల్కర్‌సల్మాన్. తాజాగా దుల్కర్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోథా’. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ సల్మాన్ హైదరాబాద్ లో సందడి చేస్తున్నాడు. సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాడు. ఇప్పటిదాకా లవర్ బాయ్ పాత్రల్లో తనను చూసిన ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా యాక్షన్ లుక్‌లో కనిపించి సర్‌‌ప్రైజ్ చేస్తానని చెప్పాడు. కింగ్ ఆఫ్ కోథాలో కోథా అంటే మలయాళంలో టౌన్ అని అర్థం అని, ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం అని వెల్లడించాడు. ఈ సినిమా దర్శకుడు తనకు చిన్ననాటి స్నేహితుడు అని చెప్పాడు. 

నటుడిగా కొత్త తరహా కథల కోసం అన్వేషిస్తున్నానని తెలిపాడు. వెరైటీ పాత్రల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ తన దగ్గరకు వచ్చిందని చెప్పాడు. ‘ఏడాదికి మూడు సినిమాలు చేసే నేను ఈ ఒక్క సినిమా కోసం ఏడాది పాటు కష్టపడ్డా. ఇప్పటివరకు నేను ఇలాంటి సినిమా చేయలేదు. పాటలు, యాక్షన్, ఫుట్ బాల్ సీక్వెన్స్‌లు చాలా బాగుంటాయి. తెలుగు, తమిళ, మలయాళ.. మూడు భాషల్లోనూ నేను డబ్బింగ్ చెప్పాను’ అని దుల్కర్ చెప్పుకొచ్చాడు. తెలుగులో సినిమాలు చేయడం తనకు ఇష్టమన్న దుల్కర్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నానని,  మరికొన్ని కథలు కూడా వింటున్నానని తెలిపాడు.
Tollywood
Kollywood
Dulquer Salman
new movie

More Telugu News