america: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆపడమెలాగంటే.. అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి వివేక్ రామస్వామి
- చైనాతో రష్యా బంధాన్ని విడదీయడమే మార్గమన్న ఇండియన్ అమెరికన్
- సీఎన్ఎన్ తో ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ యుద్ధంపై ప్రసంగం
- రష్యా- చైనా సైనిక కూటమి అమెరికాకు కూడా ముప్పేనని కామెంట్
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను నిలువరించాలంటే చైనాతో పుతిన్ దోస్తీని కట్ చేయాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. రష్యా, చైనా సైనిక కూటమితో అమెరికాకే అతిపెద్ద ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మాస్కోలో పర్యటించి, చైనాతో దోస్తీని వదులుకునేలా పుతిన్ కు నచ్చచెబుతానని కామెంట్ చేశారు. ఈ మేరకు సీఎన్ఎన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికాలో బయోటెక్ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. 2024 లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు ఆయన సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలో మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికలపై వివిధ అంశాల గురించి తన ఆలోచనలను పంచుకుంటున్నారు. తాజాగా సీఎన్ఎన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారు. రష్యా దండయాత్రను ఆపేందుకు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుసరిస్తున్న విధానం సరికాదని చెప్పారు. ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా ఎంత సాయం చేసినా నిరుపయోగమేనని, దీనివల్ల పుతిన్ చైనాకు మరింత దగ్గరవుతాడని ఆరోపించారు. చైనా, రష్యా సైనిక కూటమితో అమెరికాకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ సిటీల నుంచి రష్యా బలగాలను వెనక్కి రప్పించడానికి ఒకే ఒక మార్గం చైనాతో పుతిన్ దోస్తీని కట్ చేయడమేనని వివేక్ రామస్వామి చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టాక మాస్కోలో పర్యటిస్తానని, చైనాతో సైనిక కూటమి నుంచి వైదొలిగేలా పుతిన్ ను ఒప్పిస్తానని వివరించారు. అయితే, ఈ ప్రాసెస్ మొత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఓడించే లక్ష్యంతో కాకుండా అమెరికాను గెలిపించే లక్ష్యంతో చేపడతానని వివేక్ రామస్వామి స్పష్టం చేశారు.