yarlgadda venkat rao: వైసీపీని వీడుతున్నాను.. టీడీపీలో చేరడానికి అపాయింట్‌మెంట్ అడుగుతున్నాను: గన్నవరం నేత యార్లగడ్డ

Yarlagadda Venkat Rao leaving YCP to join TDP

  • అనుచరులతో ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు
  • వైసీపీని పటిష్ఠం చేస్తే ఉంటే ఉండు పోతే పో అనడం బాధేసిందని వ్యాఖ్య
  • సజ్జల ఆ ఒక్క మాట చెబితే బాగుండేదన్న యార్లగడ్డ
  • తనకు పదవి లేకున్నా కార్యకర్తలు తనవెంటే ఉన్నారని ఉద్వేగం
  • తాను టిక్కెట్ మాత్రమే అడిగానని, వారికేం అర్థమైందో తెలియదని వ్యాఖ్య
  • వైఎస్ బతికి ఉంటే తనకు ఇలా జరిగి ఉండేది కాదన్న యార్లగడ్డ

తాను వైసీపీని వీడుతున్నట్లు గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ కోరుతున్నట్లు చెప్పారు. గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తానని భావిస్తే టిక్కెట్ ఇవ్వాలని కోరారు. శుక్రవారం విజయవాడలో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ మాట్లాడుతూ... తాను గడపగడపకూ తిరిగి వైసీపీని పటిష్ఠం చేస్తే 'ఉంటే ఉండు పోతే పో' అన్నారని తెలిసిందని, ఈ మాటలు తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. యార్లగడ్డ పార్టీ కోసం పని చేశారని, కానీ టిక్కెట్ ఇవ్వలేకపోయామని సజ్జల ఒక్క మాట చెబితే బాగుండేదని, కానీ అలా జరగలేదన్నారు.

ప్రజాస్వామ్యంలో కొన్నింటిని కాదనలేమని, గత ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎలా గెలిచారనే విషయం పక్కన పెడితే తాను ఓడిపోయానన్నారు. తనకు పార్టీలో ఏ పదవి ఇవ్వకపోయినప్పటికీ అసలైన కార్యకర్తలు ఇప్పటికీ తనతోనే ఉన్నారని ఉద్వేగానికి లోనయ్యారు. సాధారణంగా పదవి లేకుంటే కార్యకర్తలు దూరం జరుగుతారని, కానీ మీరంతా తనవెంటే ఉన్నారని అనుచరులను ఉద్ధేశించి అన్నారు. రాజకీయాల్లో గెలుపు అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని, ఓటమి అన్ని సమస్యలకు కారణమవుతుందన్నారు. తనకు ఏ పదవి లేదని, దీంతో తన వెంట ఉన్నవారికి ఏమీ చేయలేకపోయానని, ఇందుకు అందరికీ క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఏ పని చేయకపోయినప్పటికీ మీరంతా నా వెంటే ఉన్నారని గుర్తు చేసుకున్నారు.

తనకు వైసీపీ టిక్కెట్ వచ్చినప్పుడు గన్నవరంలో గెలవడమే ధ్యేయంగా పని చేశానన్నారు. మీ అందరికీ కూడా పని చెప్పానని, కానీ మనలో ఎవరికీ పదవులు రాలేదన్నారు. అవమానాల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లుగా ఉందన్నారు. మనం చెబితే ఒక్క పని కూడా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పెద్దల అపాయింటుమెంట్ వచ్చినా రాకున్నా మన బాధలు మనకు ఉంటాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తనకు ఇలా జరిగి ఉండేది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారన్నారు. తాను పార్టీని టిక్కెట్ తప్ప ఏమీ అడగలేదన్నారు. తాను టిక్కెట్ అడిగితే వారికి ఏం అర్థమైందో తనకు తెలియడం లేదన్నారు.

  • Loading...

More Telugu News