Nara Lokesh: పోసానిపై నారా లోకేశ్ పరువునష్టం కేసు... రేపు వాంగ్మూలం
- గ్రేట్ ఆంధ్ర యూట్యూబ్ చానల్ కు పోసాని ఇంటర్వ్యూ
- లోకేశ్ కంతేరులో 14 ఎకరాల భూమి కొనుగోలు చేశారని ఆరోపణలు
- నోటీసులు పంపిన లోకేశ్... స్పందించని పోసాని
- మంగళగిరి మున్సిఫ్ కోర్టులో ఫిర్యాదు చేసిన లోకేశ్
నటుడు, దర్శకుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయపోరాటం ప్రారంభించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనకి అవినీతి బురద అంటించాలని చూశారంటూ సింగలూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తి పైనా కోర్టులో కేసు దాఖలు చేశారు.
ఈ రెండు కేసుల్లో వాంగ్మూలం నమోదు కోసం శుక్రవారం నాడు మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టుకి లోకేశ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో, యువగళం పాదయాత్రకి ఒక రోజు విరామం ప్రకటించారు.
గ్రేట్ ఆంధ్ర యూట్యూబ్ చానల్‌కి పోసాని కృష్ణమురళి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కంతేరులో లోకేశ్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని అన్నారు. కంతేరులో అరసెంటు భూమి కూడా లేని తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్షమాపణ చెప్పాలని నారా లోకేశ్ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు.
రెండుసార్లు పంపిన నోటీసులు అందినా, పోసాని కృష్ణమురళి ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో, తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ పోసానిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోర్టుని ఆశ్రయించారు.
చుండూరు సాయి ప్రైమ్ 9 యూట్యూబ్ చానల్లో నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలోనూ సింగలూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తి... అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన లోకేశ్ ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేయిస్తున్నారని తన ఫ్రెండ్ చెప్పారంటూ నిరాధార ఆరోపణలు చేసినట్టు లోకేశ్ చెబుతున్నారు. దీనిపైనా లోకేశ్ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. ఎటువంటి వివరణా, క్షమాపణ చెప్పకపోవడంతో శాంతి ప్రసాద్‌పైనా కోర్టుని ఆశ్రయించారు.
ఈ రెండు కేసుల్లోనూ ఫిర్యాదుదారుడైన లోకేశ్ వాంగ్మూలాన్ని రేపు (ఆగస్టు 18) మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదు చేయనున్నారు. కోర్టుకి హాజరవుతున్న దృష్ట్యా పాదయాత్రకి శుక్రవారం నాడు ఒక్క రోజు విరామం ప్రకటించారు.
గుడ్డ కాల్చి మీద వేస్తానంటే ఊరుకునేది లేదని, తనపై బురద చల్లేసి పోతానంటే వదిలేది లేదని నారా లోకేశ్ గతంలోనే హెచ్చరించారు. ఏ తప్పూ చేయని తనపై ఆధారాలు లేకుండానే అవాస్తవ ఆరోపణలు చేసి దాక్కుంటున్నారని, అటువంటి వారందరినీ న్యాయస్థానం ముందు నిలబెడతానని గతంలో ప్రకటించినట్టే... తప్పుడు ఆరోపణలు చేస్తున్న అందరిపైనా సివిల్, క్రిమినల్ కేసులను దాఖలు చేశారు.