Tirumala: తిరుమల నడక మార్గంలో బెంబేలెత్తిస్తున్న చిరుతలు.. అక్కడ మొత్తం ఎన్ని చిరుతలు ఉన్నాయంటే..!
- శేషాచలం ప్రాంతంలో 25 నుంచి 30 చిరుతలు ఉన్నాయన్న డీఎఫ్ఓ
- ఈ ఉదయం బోనులో చిక్కింది ఆడ చిరుత అని వెల్లడి
- నడక మార్గం పరిధిలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో అధ్యయనం చేస్తామన్న డీఎఫ్ఓ
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల్లో చాలామంది నడక మార్గంలో కొండపైకి వెళ్తుంటారు. గోవింద నామ స్మరణ చేసుకుంటూ, మార్గమధ్యంలో ఉండే పలు ఆలయాలలో పూజలు చేస్తూ వారు తిరుమల చేరుకుంటారు. అయితే, ఇప్పుడు నడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు ఒకటి, రెండు సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. నడకమార్గంలో చిరుతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ బాలికను చిరుత చంపేయడం భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది.
మరోవైపు, ఈ తెల్లవారుజామున అలిపిరి నడక మార్గంలో ఏడో మైలురాయి వద్ద చిరుత బోనులో చిక్కింది. ఈ సందర్భంగా డీఎఫ్ఓ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ... శేషాచలం అటవీ ప్రాంతంలో 25 నుంచి 30 వరకు చిరుతలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు పట్టుబడింది ఆడ చిరుత అని, దీనికి మూడేళ్ల వయసు ఉంటుందని చెప్పారు. బాలికను చంపిన చిరుత, ఇప్పుడు పట్టుబడిన చిరుత రెండూ ఒకటేనా అనే విషయాన్ని పరీక్షలు జరిపి నిర్ధారిస్తామని తెలిపారు. నడక మార్గం పరిధిలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో అధ్యయనం చేస్తామని చెప్పారు. ప్రతి కిలోమీటర్ పరిధిలో 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతల సంచారాన్ని గుర్తిస్తామని తెలిపారు.