Priyanka Gandhi Vs Modi: వారణాసిలో మోదీపై ప్రియాంకాగాంధీ పోటీ చేస్తే ఫలితం ఇదే: సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
- వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం
- అదే జరిగితే మోదీపై ప్రియాంక గెలుస్తారన్న సంజయ్ రౌత్
- రాయ్ బరేలీ, వారణాసి, అమేథీ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి పోటీ తప్పదని వ్యాఖ్య
పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడంలో బీజీగా ఉన్నాయి. పార్టీలో అంతర్గతంగా సంస్థాగత మార్పులు చేస్తూ ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వారణాసి ప్రజలు ప్రియాంకను కోరుకుంటున్నారని సంజయ్ రౌత్ అన్నారు. ప్రధాని మోదీపై వారణాసిలో ప్రియాంక పోటీ చేస్తే కచ్చితంగా ఆమె గెలుస్తారని చెప్పారు. రాయ్ బరేలీ, వారణాసి, అమేథీ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని అన్నారు.
మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఆ పార్టీ చీలిక నేత అజిత్ పవార్ భేటీ కావడంపై సంజయ్ స్పందిస్తూ... పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మన ప్రధాని మోదీ సమావేశమయినప్పుడు... శరద్ పవార్, అజిత్ పవార్ ఎందుకు భేటీ కాకూడదని ప్రశ్నించారు. ఇండియా కూటమి సమావేశానికి హాజరుకావాలని చెప్పడానికే అజిత్ ను శరద్ పవార్ పిలిచి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై శరద్ పవారే వివరణ ఇస్తారని చెప్పారు.
ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వంపై ఇద్దరు డిప్యూటీ సీఎంలు (దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్) సంతోషంగా లేరని సంజయ్ అన్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని చెప్పారు.