Rahul Gandhi: రాహుల్‌గాంధీ ఏమనుకుంటున్నారు.. మనోళ్లపైనా సాయుధ బలగాలను ప్రయోగించమంటారా?: బీజేపీ సూటి ప్రశ్న

BJP Slams Rahul Gandhi on Manipur riots

  • మణిపూర్‌లో శాంతి స్థాపనకు ఆర్మీని దించాలన్న రాహుల్ 
  • ఇందిరాగాంధీ ఐజ్వాల్‌లో బాంబులు వేయమన్నట్టు తాము కూడా చేయాలా? అని ప్రశ్న
  • రాహుల్‌కు దేశం, రాజకీయాలు అర్థం కావడం లేదని ఎద్దేవా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీజేపీ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మణిపూర్‌లో అల్లర్ల అణచివేతకు ఆర్మీని దించాలన్న రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన పౌరులపైనే ఆర్మీని ప్రయోగించాలని రాహుల్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆయన మనసులో ప్రజాస్వామ్య ఆలోచనలు లేవని దుమ్మెత్తి పోశారు. 1966లో రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ ఐజ్వాల్‌లో బాంబులు వేయమని ఎయిర్‌ఫోర్స్‌ను ఆదేశించారని గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్ కూడా అదే కోరుకుంటున్నారా? అని నిలదీశారు. 

మణిపూర్‌లో భారతీయులపై సాయుధ బలగాల ద్వారా కాల్పులు జరపాలా? లేదంటే, అక్కడ సామరస్యం నెలకొల్పి ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలా? అని ప్రసాద్ ప్రశ్నించారు. మణిపూర్‌లో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలపై పార్లమెంటులో రాహుల్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని దుయ్యబట్టారు. మణిపూర్‌లో ‘భారతమాత’ హత్యకు కేంద్ర రాజకీయాలే కారణమని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ.. దేశాన్ని, రాజకీయాలను ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారని మండిపడ్డారు. 1984 సిక్కుల ఊచకోత, 1983 నెల్లీ నరమేధాన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటారని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News