Himantha Biswa Sharma: నాకు ముస్లింల ఓట్లు అవసరమే లేదు: హిమంత బిశ్వ శర్మ
- ఓటు బ్యాంకు రాజకీయాలతో ఎప్పుడూ ఇబ్బందేనన్న అసోం సీఎం
- ప్రతి నెల తాను ముస్లింల ప్రాంతంలో పర్యటిస్తానని వ్యాఖ్య
- ఓట్ల కోసం ముస్లింలపై ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్ నటిస్తోందని విమర్శ
కాంగ్రెస్ పార్టీ మాదిరి తాను ఓటు బ్యాంక్ రాజకీయాలను ఇష్టపడనని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ముస్లిం ఓట్లు తనకు అవసరమే లేదని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఎప్పుడూ ఇబ్బందేనని అన్నారు. ప్రతి నెలా తాను ముస్లింలు ఉండే ప్రాంతంలో పర్యటిస్తానని, ముస్లింల కార్యక్రమాల్లో పాల్గొంటానని, వారితో కలుస్తానని.. అయితే రాజకీయాలతో అభివృద్ధిని ముడిపెట్టనని అన్నారు.
ఓట్ల కోసమే ముస్లింల మీద ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్ నటిస్తోందని... ఈ విషయాన్ని ముస్లింలు గుర్తించాలని చెప్పారు. తనకు ముస్లింలు ఓట్లు వేయాల్సిన అవసరం లేదని, రాబోయే పదేళ్లలో మీ ప్రాంతాలను అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. మదరసాలకు వెళ్లొద్దని, బాల్య వివాహాలు చేయవద్దని చెప్పారు. కాలేజీలకు వెళ్లి బాగా చదువుకోవాలని అన్నారు.ముస్లిం అమ్మాయిల కోసం ఏడు కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.