Karimnagar: కరీంనగర్‌లో ఎన్ఐఏ అధికారుల సోదాలు
- తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఎన్‌ఐఏ బృందం
- తబ్రేజ్ అనే వ్యక్తికి గతంలో పీఎఫ్ఐతో సంబంధం ఉన్నట్టు గుర్తింపు
- అతడి నివాసంలో నాలుగైదు గంటలు తనిఖీ చేసిన అధికారులు
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల బృందం ఈ రోజు ఉదయం కరీంనగర్‌లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ హుస్సేనీపురంకు చెందిన తబ్రేజ్ అనే వ్యక్తికి గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. దాంతో, ఎన్ఐఏ అధికారుల బృందం అతడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించింది.
ఉదయం తెల్లవారుజామునే కరీంనగర్ పట్టణం చేరుకున్న అధికారులు దాదాపు నాలుగైదు గంటలపాటు తబ్రేజ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తబ్రేజ్ ఎనిమిది నెలల క్రితం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. తనిఖీల సమయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తబ్రేజ్ ఇంటి నుంచి ఎన్‌ఐఏ అధికారులు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.