Visakhapatnam: ఏడాదిన్నరగా వివాహేతర సంబంధం.. ప్రియుడి మోజులో భర్త ను చంపేసిన భార్య

Constable Wife Killed Husband In Visakhapatnam

  • విశాఖపట్టణంలోని ఎంవీపీ కాలనీలో ఘటన
  • మద్యం తాగి నిద్రపోతున్న భర్త ముఖంపై దిండుతో అదిమిపెట్టి చంపేసిన వైనం
  • రూ. 1.50 లక్షలకు సుపారీ
  • ముగ్గురు నిందితుల అరెస్ట్

వివాహేతర సంబంధాన్ని వదులుకోలేకపోయిన ఓ కానిస్టేబుల్ భార్య కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది. మద్యం తాగించి నిద్రపోతున్న సమయంలో దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆపై గుండెపోటుగా చిత్రీకరించే క్రమంలో దొరికిపోయింది. విశాఖపట్టణంలో జరిగిందీ ఘటన. నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బర్రి రమేశ్ కుమార్ (40)-శివజ్యోతి అలియాస్ శివానీ భార్యాభర్తలు. వీరు ఎంవీపీ కాలనీలో నివసిస్తున్నారు.

వీరి ఎదురింట్లో ఉంటున్న రామారావుతో శివజ్యోతికి ఏడాదిన్నరగా వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ ఒకసారి రమేశ్ కంటపడ్డారు. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. కుటుంబ సభ్యులు ఇరువురికీ నచ్చజెప్పినా గొడవలు ఆగలేదు. దీంతో రామారావు దగ్గరికే వెళ్లిపోవాలని రమేశ్ కోప్పడేవాడు. పిల్లల్ని తీసుకుని ఆయన వద్దకే వెళ్లిపోతానని శివజ్యోతి వాదించేది.

ఈ క్రమంలో గొడవలు మరింత ముదరడంతో భర్తను హత్యచేసి అడ్డుతొలగించుకోవడంతోపాటు సాధారణ మృతిగా నమ్మించి తద్వారా వచ్చే డబ్బు, ఉద్యోగం పొందాలని ప్లాన్ చేసింది. తన వద్దనున్న బంగారాన్ని రూ. 1.50 లక్షలకు అమ్మేసి అప్పుఘర్‌కు చెందిన వెల్డింగ్ పనులు చేసే నీలాకు సుపారీ ఇచ్చింది. ఈ నెల 1న రాత్రి రమేశ్ ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయాడు. దీంతో జ్యోతి, రామారావు కలిసి నీలాను పిలిపించారు. 

నిద్రపోతున్న రమేశ్ ముఖంపై నాలా దిండుపెట్టి అదిమిపెట్టి పట్టుకోగా, శివజ్యోతి కాళ్లు పట్టుకుంది. ఇంటి బయట ఎవరూ రాకుండా రామారావు కాపలా ఉన్నాడు. తెల్లారిన తర్వాత తన భర్త గుండెపోటుతో మరణించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, తాము ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమంటూ కొన్ని ఫొటోలు చూపించడంతో అనుమానం మరింత బలపడింది.

పోస్టుమార్టంలో అదే నిజమైంది. రమేశ్ ఊపిరాడక మృతి చెందినట్టు తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో జ్యోతి అసలు నిజం ఒప్పుకుంది. నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రమేశ్-శివజ్యోతి దంపతులకు ఉన్న 3, 5 ఏళ్ల వయసున్న పిల్లలను తాత, అమ్మమ్మల సంరక్షణలో ఉంచుతామని, లేదంటే పోలీసుల సంరక్షణలోని ‘పాపా హోం’కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

Visakhapatnam
Crime News
Constable Wife
  • Loading...

More Telugu News