AP Sarpanch: టీడీపీ ఎంపీలతో కలిసి వెళ్లి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేసిన ఏపీ సర్పంచుల సంఘం

AP Sarpanch leaders met Nirmala Sitharaman along with TDP MPs

  • ఢిల్లీ వెళ్లిన ఏపీ సర్పంచుల సంఘం నేతలు
  • వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ తమ సమస్యలపై వినతులు
  • ఏపీ ప్రభుత్వం చట్ట విరుద్ధ చర్యలపై విచారణ జరిపించాలన్న వైవీబీ
  • పంచాయతీలను నిర్వీర్యం చేసే చర్యలు మానుకోవాలన్న కనకమేడల
  • 120 మంది సర్పంచులు ఢిల్లీలో కేంద్రం వద్ద ఫిర్యాదు చేశారన్న రామ్మోహన్

ఏపీ సర్పంచులు తమ సమస్యలు కేంద్రానికి వివరించేందుకు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ లతో కలిసి ఏపీ సర్పంచుల సంఘం నేతలు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీలో పంచాయతీలు, తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించారు. 

అనంతరం ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, చట్ట విరుద్ధమైన చర్యలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు. దొంగలు పడి పంచాయతీ నిధులను దొంగిలించారని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అన్ని అంశాలు కూలంకషంగా పరిశీలిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వివరించారు. 

కనకమేడల మాట్లాడుతూ, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మళ్లించడం అన్యాయమని అన్నారు. ఈ నిధుల మళ్లింపు వ్యవహారంపై పార్లమెంటులో లేవనెత్తి పోరాడతామని చెప్పారు.  

యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, 120 మంది సర్పంచులు ఢిల్లీ వచ్చి కేంద్రం వద్ద ఫిర్యాదు చేశారని తెలిపారు. సర్పంచుల ఫిర్యాదుపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. పంచాయతీలకు వస్తున్న నిధులు దారి మళ్లించడం సరికాదని అన్నారు.

  • Loading...

More Telugu News