Nara Lokesh: అజయ్ రెడ్డి, సాక్షిలపై నారా లోకేశ్ మరో న్యాయపోరాటం... రేపు మంగళగిరి కోర్టులో వాంగ్మూలం
![Nara Lokesh will give his statement in Mangalagiri court tomorrow](https://imgd.ap7am.com/thumbnail/cr-20230803tn64cb7744d9bb7.jpg)
- గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన లోకేశ్
- లోకేశ్ పై అజయ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
- సాక్షి మీడియాలో లోకేశ్ పై కథనాలు
- తన పరువుకు భంగం కలిగించారంటున్న లోకేశ్
- అజయ్ రెడ్డి, సాక్షిపై కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయం
- పాదయాత్రకి రేపు విరామం
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మరోసారి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అసత్య కథనాలు ప్రచురించిందంటూ సాక్షి పైనా... కట్టుకథలతో ఆరోపణలు చేశారంటూ అప్పటి స్కిల్ డెవలప్ మెంట్ విభాగం చైర్మన్ అజయ్ రెడ్డి పైనా కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులను దాఖలు చేసిన లోకేశ్, వాంగ్మూలం నమోదుకు శుక్రవారం(4-8-2023) నాడు కోర్టుకు హాజరు కానున్నారు. దాంతో రేపు పాదయాత్రకు విరామం ప్రకటించారు.
ప్రస్తుతం లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతుండగా... పాదయాత్ర నుంచి గురువారం రాత్రి ఉండవల్లి నివాసానికి చేరుకుని, శుక్రవారం ఉదయం మంగళగిరి కోర్టుకి లోకేశ్ హాజరవుతారు.
స్కిల్ డెవలప్ మెంటులో భారీ స్కాం అంటూ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి 2022లో ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేశ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, తనకు సంబంధం లేని అంశంపై అసత్య ఆరోపణలు చేశారంటూ లోకేశ్ తన న్యాయవాదులతో అజయ్ రెడ్డికి నోటీసులు పంపారు. అటునుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో.... తన పరువుకి భంగం కలిగించారంటూ అజయ్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని మంగళగిరి కోర్టులో లోకేశ్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
అటు, "స్కిల్ స్కాంపై ఈడీ కొరడా" పేరుతో 2022 డిసెంబర్ నెలలో సాక్షిలో ఓ కథనం వచ్చింది. వాస్తవంగా జీఎస్టీ అవకతవకలకి పాల్పడిన కంపెనీలకి ఈడీ నోటీసులు ఇస్తే, దానిని స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పేరుతో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి, నాటి మంత్రిగా ఉన్న తనకు ఆపాదిస్తూ అసత్యాలు అచ్చువేశారన్నది లోకేశ్ వాదన. ఆ మేరకు సాక్షి మీడియాకు తన న్యాయవాదులతో నోటీసులు పంపారు.
నోటీసులు అందుకున్న సాక్షి పత్రిక ఎటువంటి వివరణ వేయకపోవడం, తిరుగు సమాధానం ఇవ్వడం గానీ చేయలేదు. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించిన సాక్షిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ మంగళగిరి కోర్టులో లోకేశ్ రేపు (శుక్రవారం) వాంగ్మూలం ఇవ్వనున్నారు.