Bhola Shankar: 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం...!

Bhola Shankar pre release event likely held on this Sunday

  • చిరంజీవి ప్రధానపాత్రలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్
  • ఆగస్టు 11న వరల్డ్ వైడ్ రిలీజ్
  • వచ్చే ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశాలు
  • హైదరాబాదులో, లేదా విజయవాడలో ఈవెంట్!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టయినర్ చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.

కాగా, భోళా శంకర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నెల 6న (ఆదివారం) ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ వేడుక హైదరాబాదులోనా, లేక విజయవాడలో జరుపుతారా అనేదానిపై స్పష్టత లేదు. ఒకవేళ హైదరాబాద్ లో నిర్వహిస్తే శిల్పకళా వేదికలో జరిగే అవకాశాలున్నాయి. 

అయితే, ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఓ టీవీ చానల్ ఆదివారం నాడు తమ చానల్లో భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం అంటూ వెల్లడించింది.

ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయిక. యువ హీరోయిన్ కీర్తి సురేశ్ మెగాస్టార్ కు చెల్లెలిగా నటిస్తుండడం విశేషం. 

ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. ఇందులో సుశాంత్, వెన్నెల కిశోర్, మురళీశర్మ, రవిశంకర్, తులసి, శ్రీముఖి, సురేఖా వాణి, హైపర్ ఆది తదితరులు నటించారు.

More Telugu News