Revanth Reddy: కేసీఆర్ కు వెయ్యి ఎకరాల్లో, కేటీఆర్ కు వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ లు ఉన్నాయి: రేవంత్ రెడ్డి
- కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఉన్నాయన్న రేవంత్
- కేసీఆర్ దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి దారుణంగా ఉందని విమర్శ
- శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ కు వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్, కేటీఆర్ కు వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నాయని రేవంత్ ఆరోపించారు. వీరి కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఉన్నాయని... టీవీ ఛానల్, న్యూస్ పేపర్ కూడా వచ్చాయని చెప్పారు. కానీ కేసీఆర్ దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా గెలిపించిన మహబూబ్ నగర్ జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కేసీఆర్ నెరవేర్చలేదని రేవంత్ విమర్శించారు. తనను ఎంపీగా గెలిపిస్తే తన ఇంటిని అమ్మి మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పారని... ఆయన సీఎం అయి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అన్నారు. పాలమూరు జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వక్ఫ్ భూములను కూడా వదలడం లేదని చెప్పారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఇలా ఏ దందాలో చూసినా బీఆర్ఎస్ నేతలే ఉన్నారని దుయ్యబట్టారు.