Siddaramaiah: ఈ నాన్సెన్స్ ఏమిటి?: సీఎం సిద్ధరామయ్యను అడ్డుకున్న ఎదురింటి వ్యక్తి
- సిద్ధరామయ్య నివాసం ఎదురుగా ఉన్న నరోత్తమ్ అనే వ్యక్తి
- సీఎం కోసం వస్తున్న అతిథుల కారణంగా పార్కింగ్ సమస్య వస్తోందని ఆవేదన
- సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురయింది. ఆయన ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న ఓ సీనియర్ సిటిజన్ ఏకంగా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. సీఎం ఇంటికి వస్తున్న అతిథుల కారణంగా కొన్నేళ్లుగా తమ కుటుంబం పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటోందని, దీన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నరోత్తమ్ అనే పెద్దాయన ఈ ఉదయం సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్నారు. నేరుగా సీఎం కారు వద్దకు వెళ్లిన ఆయన... మీ కోసం వచ్చే వారు ఎక్కడపడితే అక్కడ కార్లను ఆపేస్తున్నారని... దీనివల్ల తన ఇంటి గేటు కూడా బ్లాక్ అవుతోందని చెప్పారు. గత ఐదేళ్ల నుంచి తాము తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని, ఇక భరించడం తమ వల్ల కాదని అన్నారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య పార్కింగ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
మరోవైపు, సీఎం అయినప్పటికీ సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలోకి మారలేదు. సీఎం బంగ్లాలో ఇటీవలి వరకు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పనే ఉన్నారు. గతంలో తనకు కేటాయించిన ప్రతిపక్ష నాయకుడి బంగ్లాలోనే సిద్ధరామయ్య ఉంటున్నారు. వచ్చే నెల ఆయన సీఎం అధికారిక భవనానికి మారే అవకాశం ఉంది.