Bhadrachalam: భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి

Godavari River danger level at Bhadrachalam

  • 48 అడుగులకు చేరిన నీటిమట్టం
  • సాయంత్రానికి మరింత పెరుగుతుందని అంచనా
  • అప్రమత్తమైన అధికారులు.. రెండో ప్రమాద సూచిక జారీ

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగులు ఉన్న ప్రవాహం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరింది. వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీతీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు.

 మరోవైపు, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. వాజేడు మండలంతో పాటు పేరూరు, వెంకటాపురం మండలాల్లో వరద రోడ్లపైకి చేరింది. టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఎగువ నుంచి వచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోందని కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం ఉందని చెప్పారు. గోదావరి ఉప్పొంగుతుండడంతో తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. అధికారులకు సహకరించాలని, వరద తగ్గుతుందనే నమ్మకంతో లోతట్టు ప్రాంతాల్లోనే ఉండొద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర సందర్భాలలో కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని చెప్పారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని, జలాశయాల దగ్గరకు రావొద్దని ప్రజలకు కలెక్టర్ సూచించారు.

  • Loading...

More Telugu News