Bihar: విద్యుత్ సరఫరాపై బీహార్‍లో నిరసన.. కాల్పుల్లో ఒకరి మృతి
- బీహార్ లోని కటిహార్ జిల్లాలో విషాదం
- బార్సోలైలోని సబ్ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయం వద్ద కాల్పులు
- మరో ముగ్గురికి గాయాలు.. ఆసుపత్రికి ఇద్దరి తరలింపు
బీహార్ లోని కటిహార్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ సరఫరాపై ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బార్సోలైలోని సబ్ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయం సమీపంలో జరిగింది. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ ఏర్పడింది.
తమ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ సబ్ డివిజనల్ కార్యాలయం సమీపంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసే పరిస్థితి వచ్చింది. కొంతమంది రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తిని 34 ఏళ్ల ఆలంగా గుర్తించారు. అతను బసల్ గ్రామానికి చెందినవారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం మధ్యాహ్నం గం.3 సమయానికి విద్యుత్ శాఖ తీరుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలిపారు. ఈ ప్రదర్శన సందర్భంగా కొంతమంది విద్యుత్ శాఖ కార్యాలయంపై దాడి చేశారని తెలుస్తోంది. పోలీసులు రంగప్రవేశం చేసి అదుపు చేసే ప్రయత్నం చేశారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.