Mizoram: మణిపూర్ హింసను ఖండిస్తూ.. మిజోరంలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన మిజోరం సీఎం, మంత్రులు

Thousands of people march in Mizoram to support Manipur

  • రాజధాని ఐజ్వాల్‌లో వీధుల్లోకి వచ్చిన వేలాదిమంది
  • కార్యాలయాలు మూసేసిన రాజకీయ పార్టీలు
  • మణిపూర్ బాధితులను పరామర్శించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్
  • రెండ్రోజుల వ్యవధిలో మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి అక్రమంగా 718 మంది

మణిపూర్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న హింసను ఖండిస్తూ పొరుగు రాష్ట్రం మిజోరంలో వేలాదిమంది నిన్న వీధుల్లోకి వచ్చి సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి జొరాథంగా, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ శాంతియుత ప్రదర్శనల్లో పాల్గొన్నారు. రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఈ నిరసన ప్రదర్శన ద్వారా మణిపూర్‌కు సంఘీభావం ప్రకటించారు. మద్దతుగా రాజకీయ పార్టీలన్నీ తమ కార్యాలయాలను మూసివేశాయి. 

బాధితులకు కేంద్రం పరిహారం ఇవ్వాలని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు. మరోవైపు, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్ నిన్న మణిపూర్‌లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తానే వచ్చి బాధితులను కలవగలిగినప్పుడు ప్రధానమంత్రి, మణిపూర్ ముఖ్యమంత్రి బాధితులను ఎందుకు పరామర్శించలేకపోయారని ప్రశ్నించారు.

మరోవైపు, మణిపూర్‌లోని తాజా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు మయన్మార్ వాసులు రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడుతున్నారు. రెండ్రోజుల వ్యవధిలో ఏకంగా 718 మంది అక్రమంగా ప్రవేశించారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మణిపూర్ ఆందోళనకారులకు మయన్మార్ నుంచే ఆయుధాలు సరఫరా అవుతున్నట్టు గత నెలలో నిఘా సంస్థలు గుర్తించాయి. రాష్ట్రంలో దాదాపు మూడు నెలలుగా బ్రాడ్‌బ్యాండ్ సేవలపై కొనసాగుతున్న నిషేధాన్ని కొన్ని షరతులతో పాక్షికంగా సడలించారు. మొబైల్ ఫోన్లలో మాత్రం ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News