Pawan Kalyan: అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన
- పుల్లంపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
- ఆరుగురి దుర్మరణం
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్
- వేగ నియంత్రణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని వెల్లడి
అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కడప నుంచి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును పుల్లంపేట వద్ద లారీ ఢీకొన్న ఘటన బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన 10 మందికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని, తగిన ఆర్థిక సహాయం అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
సిమెంటు లోడుతో వెళుతున్న లారీ అతివేగంగా దూసుకురావడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని మీడియా ద్వారా తెలిసిందని అన్నారు. పోలీసు, రవాణ శాఖల అధికారులు రహదారి భద్రత చర్యల్లో భాగంగా వేగ నియంత్రణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జనసేనాని పేర్కొన్నారు.