FEESI: తమిళనాడులోనే షూటింగులు, తమిళ సినిమాల్లో తమిళ నటులే అంటూ కొత్త రూల్స్... కోలీవుడ్ లో కొత్త వివాదం

New rules of FEFSI irks Tamil producers

  • కొత్త నియమావళి ప్రకటించిన ఎఫ్ఈఎఫ్ఎస్ఐ
  • ఇతర రాష్ట్రాల్లో షూటింగ్ లకు వెళ్లడంపై ఆంక్షలు
  • తప్పనిసరి అయితేనే ఇతర రాష్ట్రాల్లో షూటింగులు జరుపుకోవాలని రూల్
  • ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్ణయంపై నిర్మాతల్లో భిన్నాభిప్రాయాలు

తమిళ సినిమాల షూటింగ్ తమిళనాడులోనే జరపాలని, తమిళ సినిమాల్లో తమిళ నటులనే తీసుకోవాలని ఎఫ్ఈఎఫ్ఎస్ఐ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా) ఇటీవల కొత్త నియమావళిని ప్రకటించింది. తప్పనిసరి అయితేనే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని పేర్కొంది. 

అయితే ఈ నిబంధనలు తమిళ నిర్మాతలకు ఏమాత్రం రుచించడంలేదు. తమిళనాడులో చాలా ప్రాంతాల్లో షూటింగులు జరపడం కష్టసాధ్యమైన పని అని, అనేక చోట్ల సౌకర్యాలు కూడా ఉండవని, ఇలాంటి ప్రదేశాల్లో తాము ఎలా చిత్రీకరణలు చేయగలమని కోలీవుడ్ నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

షూటింగ్ లకు అనుమతులు సంపాదించడం కష్టసాధ్యమైన పనిగా మారిపోయిందని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ స్టూడియోల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించారని, దాంతో తాము చిత్రీకరణల కోసం పొరుగునే ఉన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళుతున్నట్టు కొందరు నిర్మాతలు వెల్లడించారు. కాగా, మరికొందరు నిర్మాతలు మాత్రం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కొత్త నిబంధనలకు మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News