NIA: మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను అదుపులోకి తీసుకోవడంపై ఎన్ఐఏ ప్రకటన  

NIA releases statement on RK wife Sireesha arrest
  • నిన్న ప్రకాశం జిల్లాలో శిరీషను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
  • శిరీషను అరెస్ట్ చేసినట్టు నేడు వెల్లడి
  • ఆర్కే డైరీ ఆధారంగా అరెస్ట్ చేశామని స్పష్టీకరణ
  • శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్ ను కూడా అరెస్ట్ చేసినట్టు వివరణ
  • వీరిద్దరూ 2019 తిరియా ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారని ఆరోపణ
మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను నిన్న ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు కార్లలో వచ్చిన ఎన్ఐఏ అధికారులు, పోలీసులు ఆమెను బలవంతంగా ఓ కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. 

అయితే, ఆమెను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అన్నది నిన్న తెలియరాలేదు. కాగా, శిరీషను అదుపులోకి తీసుకోవడంపై ఎన్ఐఏ నేడు ప్రకటన విడుదల చేసింది. 

ఆర్కే భార్య శిరీషను అరెస్ట్ చేశామని వెల్లడించింది. ఆర్కే డైరీలోని వివరాల ఆధారంగా శిరీషను అరెస్ట్ చేశామని ఎన్ఐఏ వివరించింది. శిరీషతో పాటు కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలిపింది. 

శిరీష, దుడ్డు ప్రభాకర్ మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని ఎన్ఐఏ తన ప్రకటనలో స్పష్టం చేసింది. వీరిద్దరూ మావోయిస్టుల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్టు నిర్ధారణ అయిందని పేర్కొంది.

అంతేగాకుండా, 2019 తిరియా ఎన్ కౌంటర్ లో వీరిద్దరి పాత్ర ఉందని, వీరు కూడా పాల్గొన్నారని వివరించింది. మావోయిస్టు దళాల కోసం రిక్రూట్ మెంట్లు చేపడుతున్నారని ఎన్ఐఏ ఆరోపించింది. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో, భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని వెల్లడించింది.
NIA
Sireesha
Arrest
Maoists
Duddu Prabhakar
Andhra Pradesh

More Telugu News