Manipur: మణిపూర్ వీడియో ఘటన: భార్యను కాపాడుకోలేకపోయా.. కార్గిల్ యుద్ధ వీరుడి ఆవేదన!
- యుద్ధ భూమి కంటే నా సొంతూరే భయంకరంగా ఉందన్న మాజీ సైనికుడు
- పోలీసులు అక్కడే ఉన్నా నిందితులను అడ్డుకోలేదని ఆరోపణ
- నగ్న ఊరేగింపు ఘటనలో బాధితులు ముగ్గురు
దేశ రక్షణలో ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన యుద్ధ వీరుడు కళ్ల ముందే భార్యకు అవమానం జరుగుతున్నా నిస్సహాయంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మణిపూర్ మహిళల ఊరేగింపు ఘటనలో బాధితులలో ఒకరి భర్త మాజీ సైనికుడు. అస్సాం రెజిమెంట్ లో సుబేదార్ గా సేవలందించారు. కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. తాజాగా మణిపూర్ మహిళల వీడియో ఘటనపై ఓ హిందీ న్యూస్ చానెల్ తో ఆ మాజీ సైనికుడు మాట్లాడారు.
పాక్ ముష్కరుల నుంచి దేశాన్ని కాపాడుకున్నా.. కానీ నా భార్యను, కుటుంబాన్ని కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన రోజు మరో వర్గానికి చెందిన జనం మూకుమ్మడిగా తమ గ్రామంపై దాడి చేశారని చెప్పారు. వాళ్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తలో దిక్కుకు పారిపోయామని, ఈ క్రమంలో తన భార్య మరోవైపు పరిగెత్తిందని వివరించారు. అయినా విడవకుండా వెంటాడి పట్టుకున్నారని, తన భార్య సహా ముగ్గురు మహిళలను దిగంబరంగా మార్చి వీధుల్లో నడిపించారని చెప్పారు.
దాదాపు వెయ్యి మంది మూకుమ్మడిగా వచ్చి తన భార్య సహా మరో ఇద్దరు మహిళలను దిగంబరంగా మార్చి ఊరేగిస్తుంటే అక్కడున్న పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం యుద్ధ భూమి కంటే తన సొంతూరే భయంకరంగా ఉందని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి ఆ మాజీ సైనికుడు విజ్ఞప్తి చేశారు.