Sridhar Reddy: వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆస్తుల వేలం
- బ్యాంకు రుణాలు చెల్లించడంలో విఫలమైన మెసర్స్ ఇన్ఫ్రా కంపెనీ
- కంపెనీకి హామీదారుగా ఉన్న శ్రీధర్ రెడ్డి
- అసలు, వడ్డీతో కలిపి రూ. 908 కోట్లకు చేరిన రుణాలు
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను కెనరా బ్యాంకు వేలం వేయనుంది. ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే మెసర్స్ సాయిసుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. అయితే వాటిని చెల్లించలేదు. ఈ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీదారుడిగా ఉన్నారు. దీంతో కంపెనీతో పాటు, శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్ట్ 18న వేలం వేస్తున్నట్టు బ్యాంకు ప్రకటించింది.
గతంలో ఈ కంపెనీ మెసర్స్ ఏఎస్ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ గా ఉండేది. ఈ కంపెనీకి శ్రీధర్ రెడ్డి భార్య అపర్ణ రెడ్డి, తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ తీసుకున్న రుణాలు ఏప్రిల్ 30వ తేదీ నాటికి అసలు, వడ్డీతో కలిపి రూ. 908 కోట్లకు చేరుకున్నాయి. వీటిని చెల్లించకపోవడంతో ఆస్తులను బ్యాంకు వేలం వేస్తోంది. ఆస్తులు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు సమాచారం.