Margani Bharat: చిరాగ్‌ను మోదీ హగ్ చేసుకుంటే.. పవన్ కల్యాణ్ వెనుక నిలబడ్డారు: ఎంపీ భరత్ ఎద్దేవా
- జనసేనాని ఢిల్లీలో సినిమా యాక్టింగ్ బాగా చేశారని ఎద్దేవా
- తెలంగాణలో ఉంటూ ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
- పవన్ మాట్లాడిన ఇంగ్లీష్ చూశాక.. ఇలా కూడా మాట్లాడవచ్చా అనిపించిందని సెటైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ బుధవారం నిప్పులు చెరిగారు. జనసేనాని ఢిల్లీలో సినిమా యాక్టింగ్ బాగా చేశారన్నారు. హోదా పాచిపోయిన లడ్డూ అన్న వ్యక్తి బీజేపీ వైపు ఎలా చేరారు? అని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ లు వలస లీడర్లు అని ఎద్దేవా చేశారు. వీరు ఉండేది తెలంగాణలో.. రాజకీయాలు ఆంధ్రాలో చేస్తారన్నారు. ఇలాంటి వలస నాయకులతో మనకు ఏం పని? అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబంతో సహా ఏపీలోనే ఉంటున్నారన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం వలస పక్షులు అన్నారు.
ఏపీకి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని, ఆ పార్టీ వైపు ఎందుకు వెళ్లారో చెప్పాలని పవన్ ను నిలదీశారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చారా? హామీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చారా? ఏం చేశారని బీజేపీ వైపు వెళ్లారు? అని ప్రశ్నించారు. పవన్ ఢిల్లీకి వెళ్లి సినిమా చిందులు వేశారని, ప్రధాని నరేంద్ర మోదీ వెనుక నిల్చున్నారన్నారు. కానీ ప్రధాని మోదీ... చిరాగ్ పాశ్వాన్ ను హగ్ చేసుకున్నారని, పవన్ ఆ వెనుక నిల్చున్నారని, ఆయన వ్యాల్యూ ఏంటో తేలిపోయిందన్నారు. నిన్న ఢిల్లీలో పవన్ ఇంగ్లీష్ లో మాట్లాడారని, అది చూశాక ఇలా కూడా మాట్లాడవచ్చా? అని తనకు అనిపించిందన్నారు.