Dasoju Sravan: రేవంత్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించాలి: కాంగ్రెస్‌కు దాసోజు శ్రవణ్ లేఖ

Dasoju Sravan letter to Congress Party High Command

  • ట్రాన్స్ జెండర్లను అవమానిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్న దాసోజు
  • పేద రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదన్నారని విమర్శ
  • మర్యాద, సంస్కారం లేని వ్యక్తి రేవంత్ అని ఆగ్రహం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆ పదవి నుండి తప్పించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని అవమానించడం, ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్నారని ఆ లేఖలో నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన లేఖలో...

ఓ వైపు మహిళా విభాగం కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్ మహిళ అపర్ణారెడ్డిని నియమించినట్లు ఏఐసీసీ చెబుతోందని, కానీ రేవంత్ మాత్రం వారిని తన చర్చల్లోకి లాగి దుర్భాషలాడుతున్నారన్నారు. యాదవులు, దొమ్మర్లు, వంశరాజులను హేళన చేయడంతో పాటు మిగతా కులాలను చులకన చేస్తున్నారన్నారు. కులాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి బాధ్యతారాహిత్యమైన నాయకుడిని సంఘం నుండి బహిష్కరించాలని, రేవంత్ తన అగ్రకుల అహంకారాన్ని బయట పెట్టుకుంటున్నారని నిప్పులు చెరిగారు. 

మూడు ఎకరాల భూమి ఉన్న పేద రైతులకు మూడు గంటల కంటే ఎక్కువ విద్యుత్ అవసరం లేదని మాట్లాడారని, ఇలాంటి మూర్ఖపు మాటలతో తెలంగాణ రైతులను అవమానిస్తున్నారన్నారు. రేవంత్ ఇష్టారీతిన మాట్లాడుతుంటే ఖర్గే, రాహుల్, ప్రియాంకలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ పాలనలో సమాజంలోని ప్రతి వర్గానికి ఎంతో గౌరవం ఉందన్నారు. రేవంత్ నోటికి అదుపులేకుండా మాట్లాడుతున్నారని, అవతలి వ్యక్తులను, వారి వయస్సును, వారి కులాలను లెక్క చేయకుండా మాట్లాడుతున్నారన్నారు.

మర్యాద, సంస్కారం లేని వ్యక్తి రేవంత్ అని, ఆయన ఒక మానసిక రోగి అని దుయ్యబట్టారు. నాయకులను, వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. అతడిని క్వారంటైన్‌లో ఉంచాలని, నేర చరిత్ర ఉన్న వ్యక్తి రేవంత్‌ని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించి భారత జాతీయ కాంగ్రెస్ తప్పు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భావిస్తే.. రేవంత్ ను వెంటనే అధ్యక్ష బాధ్యతల నుండి తొలగించాలని, ఆయనతో అన్ని వర్గాలకు క్షమాపణలు చెప్పించాలన్నారు.

  • Loading...

More Telugu News