IRCTC: ఇక టికెట్ తోపాటే డిఫాల్ట్ గా బీమా సదుపాయం.... ఐఆర్ సీటీసీ నిర్ణయం
- రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో బీమా ఆప్షన్ ఎంచుకునే వీలు
- కొన్నిసార్లు హడావిడిలో బీమా ఆప్షన్ టిక్ చేయడం మర్చిపోతున్న ప్రయాణికులు
- మరికొందరిలో దానిపై అవగాహన లేని వైనం
- ఈ నేపథ్యంలో, ఎల్లప్పుడూ టిక్ మార్క్ తోనే బీమా ఆప్షన్ బాక్స్
- ప్రయాణికులు ప్రత్యేకంగా టిక్ చేయాల్సిన పని ఉండదంటున్న ఐఆర్ సీటీసీ
సాధారణంగా ఐఆర్ సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా రైల్వే టికెట్ల బుకింగ్ సమయంలో ప్రయాణికులు బీమా సదుపాయం ఆప్షన్ ను టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్ ను టిక్ చేస్తేనే వారు బీమా సదుపాయానికి అర్హులు అవుతారు.
కొందరు దానిపై అవగాహన లేక, మరికొందరు హడావిడిలో ఆ ఆప్షన్ ను వదిలేస్తుంటారు. ఈ బీమా సదుపాయాన్ని ఎంచుకున్న వారు రైలు ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా వారి కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తారు.
ఇంత ముఖ్యమైన బీమాను చాలామంది ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవడం లేదని ఐఆర్ సీటీసీ గుర్తించింది. దాంతో, ఈ బీమాను డిఫాల్ట్ చేసేసింది. ఇకపై టికెట్ తో పాటే బీమా సదుపాయం కూడా డిఫాల్ట్ గా లభిస్తుంది. పక్కనున్న బీమా సదుపాయం ఆప్షన్ బాక్స్ లో ఎప్పుడూ టిక్ చేసి ఉంటుంది. ప్రయాణికులు ప్రత్యేకంగా టిక్ చేయాల్సిన అవసరంలేదు. ఒకవేళ బీమా ప్రయోజనాలు వద్దనుకుంటే మాత్రం... ఆ టిక్ ను తీసేయొచ్చు.
ఈ బీమా ఖరీదు ఎంతో కాదు.... కేవలం 35 పైసలే. వాస్తవానికి భారతదేశ నిబంధనల ప్రకారం బీమాను ఎక్కడా డిఫాల్ట్ గా ఇవ్వరు. ఒక్క ఐఆర్ సీటీసీకి మాత్రం మినహాయింపునిచ్చారు.