Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశమంటూ మెయిల్స్.. సల్మాన్ వివరణ!
- సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రస్తుతం ఏ చిత్రానికి నటీనటులను తీసుకోవడం లేదని స్పష్టీకరణ
- అలాంటి మెయిల్స్ వస్తే నమ్మవద్దని విజ్ఞప్తి
- ఫేక్ మెయిల్స్ పంపించిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడి
తన నిర్మాణ సంస్థ పేరుతో ఓ ఫేక్ మెయిల్ చక్కర్లు కొడుతోందని, దీనిని ఎవరూ నమ్మవద్దని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇలాంటి ఫేక్ మెయిల్స్ సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సల్మాన్ ఖాన్ కు సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఆ సంస్థ పేరుతో ఇటీవలి కాలంలో ఓ ఫేక్ మెయిల్ చాలామందికి వస్తోంది. సల్మాన్ ఖాన్ తెరకెక్కించబోయే ఓ సినిమాలో నటీనటులను ఎంపిక చేస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన సల్మాన్ ఖాన్ ప్రకటనను విడుదల చేశారు.
'సల్మాన్ ఖాన్ లేదా సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రస్తుతం ఏ చిత్రానికి సంబంధించి నటీనటులను తీసుకోవడం లేదు. అలాగే మా భవిష్యత్ చిత్రాల కోసం కాస్టింగ్ ఏజెంట్లను నియమించుకోలేదు. నటీనటులను ఎంపిక చేస్తున్నామంటూ ఏదైనా మెయిల్స్ వస్తే దయచేసి వాటిని విశ్వసించవద్దు. ఖాన్ లేదా ఎస్కేఎఫ్ పేరును ఏదైనా అనధికారిక పద్ధతిలో ఏదైనా పార్టీ తప్పుగా ఉపయోగించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయ'ని పేర్కొన్నారు.