Woman cheating: తమ భార్య కనిపించట్లేదంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చిన 12 మంది యువకులు.. అందరి చేతుల్లో ఒకే అమ్మాయి ఫొటో !
- కాశ్మీర్ లో మాయలేడి ఘరానా మోసం
- ఏకంగా 27 మందిని పెళ్లాడిన మహిళ
- పెళ్లయ్యాక కొన్ని రోజుల తర్వాత డబ్బు, నగలతో పరార్
- నెట్ ఫ్లిక్స్ లో వచ్చే కార్యక్రమంలా ఉందన్న ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో తమ భార్య కనిపించడం లేదంటూ 12 మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులు ఇచ్చిన ఫొటోలు చూసిన పోలీసులు షాకయ్యారు. ఆ పన్నెండు మంది ఇచ్చిన ఫొటోలలో ఉన్నది ఒకే మహిళ కావడమే దీనికి కారణం. వివరాలు ఆరా తీయగా.. కొంచెం అటూఇటూగా అందరు చెప్పిన స్టోరీ ఒకేలా ఉంది.
మధ్యవర్తి సాయంతో పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజుల కాపురం తర్వాత కనిపించకుండా పోవడం.. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 27 మందిని పెళ్లాడిందని పోలీసుల విచారణలో తేలింది. అందులో 12 మంది మాత్రమే పోలీసుల దాకా వచ్చారని మిగతా బాధితులు ఫిర్యాదు చేయలేదని బయటపడింది.
బుద్గాం జిల్లాకు చెందిన ఓ బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. శారీరక అనారోగ్యం కారణంగా తన కొడుకుకు పెళ్లి కాలేదని, ఈ విషయం తెలిసి ఓ మధ్యవర్తి తనను ఆశ్రయించడని చెప్పారు. రూ.2 లక్షలు ఇస్తే పెళ్లి సంబంధం కుదురుస్తానని చెప్పాడన్నారు. దీంతో అతడితో ఒప్పందం కుదుర్చుకుని పెళ్లి ఖాయం చేసుకున్నామని తెలిపారు.
పెళ్లి ఏర్పాట్లలో ఉండగా పెళ్లి కూతురుకు ప్రమాదం జరిగిందంటూ మధ్యవర్తి చెప్పాడని, తాము ఇచ్చిన డబ్బులో సగం వాపస్ ఇచ్చాడని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మరో యువతి ఫొటో చూపించాడని, తాము అంగీకారం తెలపడంతో పెళ్లి కుదిర్చాడని వివరించారు. పెళ్లి సమయంలో వధువుకు రూ.3.80 లక్షల నగదు, రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు నగలను మెహర్ గా ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు. కాపురానికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఆసుపత్రికని వెళ్లి పారిపోయిందని బాధితుడు వాపోయారు. దాదాపుగా మిగతా బాధితుల అనుభవం కూడా ఇలాగే ఉందని పోలీసులు తెలిపారు.
ఇలా ఒక్క బుద్గాం జిల్లాలోనే 27 మందిని మోసం చేసిందని, అందులో కేవలం 12 మంది మాత్రమే ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఉదంతం మొత్తం నెట్ ఫ్లిక్స్ లో వచ్చే సీరియల్ లా ఉందంటూ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. సదరు మాయలేడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.