Mission Bhagiratha: జీతం చాలక, పిల్లల్ని సాకలేక మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య
- నల్లగొండ జిల్లా హాలియాలో మహిళా ఉద్యోగి బలవన్మరణం
- ఏడాది క్రితం భర్త ఆత్మహత్యతో ఆమెకు మిషన్ భగీరథ ఉద్యోగం
- గురువారం లేఖ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డ వైనం
జీతం చాలక, ఆర్థిక కష్టాలు భరించలేక మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. తక్కువ జీతంతో పిల్లలను సాకలేకపోతున్నానంటూ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా హాలియాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుమలగిరిసాగర్ మండలం అల్వాల గ్రామానికి చెందిన సింగం పుష్పలతకు(26) వివాహం అయ్యింది. ఆమె భర్త మహేశ్ పానగల్ మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసేవాడు. వారికి పాప సాన్విత, బాబు సాయినందన్ ఉన్నారు.
చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకురాలేక మహేశ్ ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, ఆయన ఉద్యోగం పుష్పలతకు ఇచ్చారు. ఆ తరువాత ఆమె సాయిప్రతాప్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటోంది. కాగా, గురువారం సాయంత్రం ఆమె తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనకొచ్చే రూ.9500 జీతం చాలట్లేదని, అది కూడా సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నానని లేఖ రాసింది. తన కడుపులో గడ్డ ఉందని, ఆపరేషన్‌కు రూ.2 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్టు లేఖలో పేర్కొంది.