Floods: వరదలకు 145 మంది బలి.. నేడు ఉత్తరాఖండ్, హర్యానాను కుదిపేయనున్న భారీ వర్షాలు
- విరిగిపడుతున్న కొండచరియలు
- చిక్కుకుపోయిన పర్యాటకులు
- 16 వరకు ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
- ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 91 మంది మృతి
రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 145 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడుతూ భయపెడుతున్నాయి. పలువురు పర్యాటకులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వరదల కారణంగా ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 14 మంది, హర్యానాలో 16, పంజాబ్‌లో 11, ఉత్తరాఖండ్‌లో 16 మంది మృతి చెందారు.
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో నేడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరదల నేపథ్యంలో ఢిల్లీలో ఎల్లుండి (16వ తేదీ) వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అలాగే, ఎర్రకోట సందర్శనను నేడు నిలిపివేస్తున్నట్టు తెలిపారు.