Revanth Reddy: నా మాటలను ఎడిట్ చేసి కేటీఆర్ అతితెలివి ప్రదర్శించారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy fires at KTR and KCR

  • బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆరే కారణమన్న రేవంత్ 
  • ఉచిత విద్యుత్ పై చర్చకు సిద్ధమని సవాల్
  • కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత విద్యుత్ కోసం టీ కాంగ్రెస్ పోరాటం చేసిందన్న రేవంత్

ఉచిత విద్యుత్‌పై తానా సభల్లో తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ వక్రీకరించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. తన మాటలను ఎడిట్ చేసి కేటీఆర్ అతితెలివి ప్రదర్శించారన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఉంటుందా? అని తానా సభలో తనను అడిగారని, తాను చెప్పిన సమాధానంలో ఒక బిట్ ను కట్ చేసి వక్రీకరించారన్నారు. 2004 మేనిఫెస్టోలోనే తమ పార్టీ ఉచిత విద్యుత్ ను పెట్టిందని, కానీ కేసీఆర్ కుదరదని చెప్పారన్నారు.

ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ తో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ పథకం తీసుకు వచ్చిందే కాంగ్రెస్ అన్నారు. రైతులను అన్నివిధాలా ఆదుకొని, వ్యవసాయాన్ని పండుగ చేసింది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ వల్లే ఈ రోజు తెలంగాణలో విద్యుత్ వెలుగులు అన్నారు. వైఎస్ వచ్చాక ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేశారన్నారు. 2009లో ఏడు గంటల నుండి 9 గంటలకు సరఫరాను పెంచినట్లు చెప్పారు. రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్సే అన్నారు.

విభజనకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత విద్యుత్ కోసం తెలంగాణ కాంగ్రెస్ కొట్లాడిందన్నారు. అందుకే వినియోగం పద్ధతిన తెలంగాణకు 53 శాతం విద్యుత్ వచ్చినట్లు చెప్పారు. జనాభా ఎక్కువగా ఉన్న ఏపీకి 47 శాతం మాత్రమే వెళ్లిందన్నారు. తాను రైతు బిడ్డనని, కేటీఆర్ లాగా అమెరికాలో పని చేయలేదన్నారు. తాను వ్యవసాయం చేశానని, నాగలి కట్టినట్లు చెప్పారు. తనతో పొలంలో కేటీఆర్ పోటీ పడగలడా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కు సవాల్ విసురుతున్నానని... తనతో పాటు వ్యవసాయం చేయగలడా? అని నిలదీశారు. తన వ్యాఖ్యలపై కేటీఆర్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేస్తోందన్నారు.

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆరే కారణమని, ఆనాడు రైతులను కాల్చి చంపించింది కూడా ఆయనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత కరెంట్ కు వ్యతిరేకంగా నాడు కేసీఆర్ ప్రకటనలు ఇచ్చారన్నారు. తాను పీసీసీ హోదాలో తానా సభకు హాజరయ్యానని, తమ పార్టీ విధానాలను వివరించేందుకు వెళ్లినట్లు చెప్పారు. ఎక్కడా లేని రేటుకు తెలంగాణ విద్యుత్ కొనుగోలు చేస్తోందని, కేంద్రం మాట వినకుండా అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News