IND Vs WI Test: వెస్టిండీస్ ను కుప్పకూల్చిన అశ్విన్.. పలు రికార్డులను ఖాతాలో వేసుకున్న స్పిన్ దిగ్గజం
- 150 పరుగులకే విండీస్ ను ఆలౌట్ చేసిన టీమిండియా
- అశ్విన్ కు 5 వికెట్లు, జడేజాకు 3 వికెట్లు
- 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డు
వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలానికి విండీస్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. కేవలం 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లను తీయగా... సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లలో అలిక్ అథానాజ్ 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరే బ్యాట్స్ మెన్ పెద్దగా ఆడలేకపోయాడు.
మరోవైపు తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమిండియా వికెట్ ను కోల్పోకుండా 80 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 40 పరుగులతో, కెప్టెన్ రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో వచ్చాయి.
5 వికెట్లను కుప్పకూల్చిన అశ్విన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియా తరపున అత్యధిక వికెట్లను బౌల్డ్ చేసిన ఘనతను సాధించాడు. అశ్విన్ 95 మంది బ్యాట్స్ మెన్ ను బౌల్డ్ చేయగా... అనిల్ కుంబ్లే (94) రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో కుంబ్లే 953 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా... హర్భజన్ సింగ్ 707 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
టెస్ట్ క్రికెట్ లో తండ్రీకొడుకులను ఔట్ చేసిన ఐదో బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. 2011లో ఢిల్లీలో టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అశ్విన్ ఆ మ్యాచ్ లో తండ్రి శివ్ నారాయణ్ చందర్ పాల్ ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ లో కొడుకు త్యాగ్ నారాయణ్ చందర్ పాల్ ను ఔట్ చేసి ఈ ఫీట్ ను సాధించాడు. తండ్రీకొడుకులను ఔట్ చేసిన తొలి భారత బౌలర్ గా నిలిచాడు.
అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీయడం అశ్విన్ కు ఇది 33వ సారి. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు ఈ ఫీట్ ను సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఇండియా నుంచి అనిల్ కుంబ్లే (35) ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.