WB Panchayat Polls: బెంగాల్‌లో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. దూసుకెళ్తున్న టీఎంసీ

West Bengal Panchayat Poll Results TMC Leading
  • రాష్ట్రంలోని 74 వేల స్థానాలకు ఈ నెల 8న ఎన్నికలు
  • మెజారిటీ స్థానాల్లో అధికార టీఎంసీ ముందంజ
  • ఇప్పటి వరకు ఒక్క స్థానంలోనూ ఆధిక్యం చూపలేకపోయిన బీజేపీ, కాంగ్రెస్
పలు హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. ఎన్నికల్లో హింస నేపథ్యంలో లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 8న రాష్ట్రంలోని 74 వేల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 80.71 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగుకు ముందు, పోలింగ్ రోజున చాలా చోట్ల హింస చెలరేగింది. కొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులను తగలబెట్టారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం పంచాయతీ, జిల్లా పరిషత్ సీట్లలో ముందంజలో ఉంది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఇప్పటి వరకు ఒక్క స్థానంలోనూ ఆధిక్యం కనబర్చలేదు. కాగా, ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. మరోవైపు, ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పౌల్ మాట్లాడుతూ.. హత్యలు, ఘర్షణల మధ్య జరిగిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టు ప్రభుత్వం పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఈ ఎన్నికల్లో తాము ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగినట్టు చెప్పారు. ఈ మధ్యాహ్నం తనపై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
WB Panchayat Polls
West Bengal
Panchayat Polls
TMC
BJP
Congress

More Telugu News