Pawan Kalyan: ఐదువేలిచ్చి ఇంట్లో దూరే అవకాశమిచ్చారు: వాలంటీర్ వ్యవస్థపై మరోసారి పవన్ కల్యాణ్ కామెంట్

Pawan Kalyan again on volunteers

  • అందరు వాలంటీర్ల గురించి మాట్లాడటం లేదని స్పష్టీకరణ
  • ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్ వ్యవస్థతో పనేమిటని నిలదీత
  • ప్రభుత్వం ఉద్దేశ్యం వేరే కావొచ్చు.. కానీ డేటా వేరే వారి చేతుల్లోకి వెళ్తే ఎలాగని ప్రశ్న
  •  ఐదువేలిచ్చి వాలంటీర్లతో జగన్ ఊడిగం చేయిస్తున్నారని విమర్శ

వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే తాను అందరు వాలంటీర్లను అనడం లేదని స్పష్టతనిచ్చారు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ముప్పేట దాడి చేసింది. అయినప్పటికీ ఏలూరు కార్యకర్తలు, వీర మహిళల సమావేశంలో పవన్ వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడుతూ... ప్రజలను అదుపు చేయడానికే ఈ వ్యవస్థ అన్నారు. కొన్నిచోట్ల ప్రజలను బెదిరిస్తున్నారన్నారు.

వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళ్తోందన్నారు. పంచాయతీరాజ్ సహా ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్ వ్యవస్థతో పనేమిటని ప్రశ్నించారు. అయితే తాను అందరు వాలంటీర్ల గురించి మాట్లాడటం లేదని, వారి పొట్ట కొట్టడం తన ఉద్దేశ్యం కాదన్నారు. వంద తాజా పండ్లలో ఒక్కటి కుళ్లినా మిగతావి కుళ్లిపోతాయన్నారు. పది మంది ఇంటింటికి తిరగడం ఏమిటన్నారు. 

వారికి రూ.5 వేలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశమిచ్చారని ఆరోపించారు. యువత సామర్థ్యాన్ని జగన్ గుర్తించడం లేదని, రూ.5 వేలకు వారితో ఊడిగం చేయిస్తున్నారన్నారు. నిరుద్యోగం పెరిగితేనే డిగ్రీ చదివి రూ.5 వేలకు పని చేస్తారన్నారు. శ్రమ దోపిడీ చేసే జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మీ డేటా అంతా వాళ్లకు తెలుసునని, ఎవరు ఎక్కడకు వెళ్తున్నారో అంతా తెలుస్తుందన్నారు. ఈ సమాచారం వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తే ఎలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్దేశ్యం వేరే కావొచ్చు..కానీ సెన్సిటివ్ సమాచారం బయటకు పొక్కితే సమస్య అన్నారు.

వాలంటీర్ వ్యవస్థను చాలా జాగ్రత్తగా గమనించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి పార్టీ వారు వాలంటీర్ వ్యవస్థపై కన్నేసి ఉంచాలన్నారు. వారి పని వారు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదని, వైసీపీకి మాత్రమే పని చేస్తామంటే మాత్రం గట్టిగా అడగాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు ఉన్న కుటుంబాలు ఈ వ్యవస్థ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసరంగా మీ డేటా వారికి ఇవ్వవద్దని సూచించారు. ఒంటరి మహిళలు, వితంతువులు జాగ్రత్తగా ఉన్నారా? అని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. మహిళల మిస్సింగ్ పై కేంద్ర సంస్థలు అధ్యయనం చేస్తున్నాయన్నారు. బియ్యం పంపిణీ తర్వాత ఉచిత బియ్యం వ్యాన్లు ఎక్కడకు వెళ్తున్నాయని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News