Gudivada Amarnath: మొన్న పార్ట్–1, ఇప్పుడు పార్ట్–2 అంట.. రాజకీయమంటే వెబ్‌సిరీస్‌నా?: పవన్ కల్యాణ్‌పై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
- ఎన్నికలు జరగకముందే పవన్ విజయ యాత్ర చేస్తున్నారన్న అమర్నాథ్
- రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు ఓ విలన్ అని ఆరోపణ
- ఎన్ని యాత్రలు చేసినా గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ సినిమాల్లో హీరో అని, రాజకీయాల్లో సైడ్ హీరోనే అని సెటైర్లు వేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారు? మొన్నటి వరకు పార్ట్-1.. ఇప్పుడు పార్ట్-2 విజయ యాత్ర అంట. ఎన్నికలు జరగకముందే విజయ యాత్ర చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.
‘‘వారం రోజులు తిరక్కముందే జరం వచ్చేసింది.. మంచాన పడ్డారు. మళ్లీ నాలుగు రోజులు రెస్టు. ఇప్పుడు పార్ట్-2. రాజకీయమంటే వెబ్‌సిరీస్‌నా? ఓటీటీలో వచ్చే వెబ్‌సిరీస్ అనుకున్నారా?” అని అమర్నాథ్ ప్రశ్నించారు.
‘‘మిమ్మల్ని హీరోని చేయాలని మీ పార్టీ నాయకులు అనుకుంటుంటే.. పక్క సినిమా హీరో పక్కన నిలుచుంటానని మీరు అంటున్నారు. కానీ మీ పక్కనున్న వ్యక్తి విలన్ అనే విషయం మీరు మరిచిపోతున్నారు. ఎవరినైతే ఎత్తుకుని తిరుగుదామని ప్రయత్నం చేస్తున్నారో ఆ చంద్రబాబు.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ విలన్. ఆయన కోసం ఎందుకు మీరు తాపత్రయపడుతున్నారు?” అని ప్రశ్నించారు.
‘‘175 సీట్లలో పోటీ చేసి.. అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు అవకాశం ఇవ్వొచ్చు. చంద్రబాబును పట్టుకుని, కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదుతామంటే ఎలా? చంద్రబాబును భుజాన వేసుకుని తిరగడానికి రాజకీయ పార్టీ దేనికి?” అని మంత్రి నిలదీశారు.
‘‘175 సీట్లను ఎలా కొట్టాలా? అని మేం చూస్తుంటే.. అసలు 175 సీట్లలో అభ్యర్థులను ఎలా పెట్టాలా అని చంద్రబాబు, పవన్ ఆలోచిస్తున్నారు. ఎంత తేడా ఉంది. 175 సీట్లలో పోటీ చేసేందుకు కూడా వాళ్లకు అభ్యర్థులు లేరు. అలాంటి మీకు, మాకు పోటీనా? మీరు ఎన్ని యాత్రలు చేసినా 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి” అని గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు.