vangalapudi anitha: భారతిరెడ్డి పీఏ తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని వంగలపూడి అనిత తీవ్ర ఆరోపణ
- సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం
- సమాధానం చెప్పలేక వైసీపీ పేటీఎం బ్యాచ్ అసత్య ప్రచారం చేస్తోందని వెల్లడి
- పవన్ కల్యాణ్ సతీమణిపై కూడా దారుణమైన పోస్టులు పెట్టారన్న టీడీపీ నేత
- భారతిరెడ్డిపై పోస్టులు పెడితే స్పందించిన వాసిరెడ్డి పద్మ ఇప్పుడేం చేస్తున్నారని నిలదీత?
తనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ విశాఖపట్నం నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేత వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. తనపై అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసభ్యకరంగా మాట్లాడుతూ, మార్ఫింగ్ ఫొటోలతో పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఈ పేటీఎం బ్యాచ్ ఐదు... పది రూపాయలకు కూడా మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు.
వైఎస్ భారతిరెడ్డి పీఏ రవీంద్ర రెడ్డి సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారంతో పాటు, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి పైనా దారుణమైన పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో తాను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
గతంలో జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సెమినార్ నిర్వహించారని అనిత గుర్తు చేశారు. ఇప్పుడు ఆమె ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మహిళలపై దారుణంగా ట్రోల్ చేస్తున్నప్పటికీ మహిళ హోం మినిస్టర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
జగన్, భారతిరెడ్డి, వాసిరెడ్డి పద్మలకు చిత్తశుద్ది ఉంటే ఇప్పుడూ సెమినార్ నిర్వహించాలన్నారు. రవీంద్రరెడ్డి ఈ రోజు నా సంతకం... రేపు మీది.. అలాగే వదిలేస్తే జగన్ ప్రభుత్వంలోను ఏదో జీవో మీద సంతకం పెట్టేస్తాడని విమర్శించారు. అతనిని తక్షణమే శిక్షించాలని, అరెస్ట్ చేయకుంటే తీవ్ర నిరసనలు చేపడతామని హెచ్చరించారు.