YS Jagan: బీచ్ కి ఎంట్రీ ఫీజు... పునరాలోచన చేయాలని జగన్ ప్రభుత్వానికి గంటా సూచన

Former Minister Ganta Srinivasa Rao fires at YS Jagan government

  • విశాఖలో తాకట్టు పెట్టాలనుకున్నవన్నీ పెట్టేశారని విమర్శ
  • రుషికొండ వెళ్లాలంటే రూ.20 ఎంట్రీ ఫీజుపై ప్రకృతి ప్రేమికుల అసహనమని వ్యాఖ్య
  • వైసీపీ అధికారంలోకి రాగానే బీచ్ వద్ద పార్కింగ్ ఫీజు పెట్టారని ఆగ్రహం

రుషికొండ బీచ్ కు జగన్ ప్రభుత్వం ఎంట్రీ టిక్కెట్లు పెట్టడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'విశాఖలో తాకట్టు పెట్టాలనుకున్నవన్నీ పెట్టేశారు. అమ్మివేయాలనుకున్నవన్నీ అమ్మేశారు. కూల్చాలనుకున్నవి కూల్చేశారు. వేయాలనుకున్న పన్నులన్నీ వేసేశారు. ఇప్పుడేమో బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు' అని ట్వీట్ చేశారు.

విశాఖ అంటే అందమైన బీచ్ లు గుర్తుకు వస్తాయని, సముద్రతీరంలో కాసేపు సేదతీరితే ఒత్తిడి తగ్గుతుందని విశాఖవాసులు సాయంత్రం సమయంలో అలా బీచ్ కు వస్తుంటారని, కానీ ఇక నుండి బ్లూ ఫాగ్ గా గుర్తింపు కలిగిన రుషికొండ బీచ్ కు వెళ్లాలంటే రూ.20 ఎంట్రీ ఫీజు పెట్టడంతో ప్రకృతి ప్రేమికుల నుండి తీవ్ర అసహనం వ్యక్తమవుతోందని గంటా అన్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజు కింద బైక్స్ కు రూ.10, కార్లకు రూ.30, బస్సులకు రూ.50 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడేమో బీచ్ లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు, తీరం అందాలు ఆస్వాదించాలంటే ప్రభుత్వమే ఆధునాతన హంగులతో బీచ్ లను అభివృద్ధి చేసి పర్యాటకులను, నగరవాసులను ఆకట్టుకోవాల్సింది పోయి ఎంట్రీ ఫీజులు పెట్టి పర్యాటకుల నడ్డి విరుస్తున్నారన్నారు. ఎంట్రీ టిక్కెట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.

More Telugu News