Sourav Ganguly: వరల్డ్ కప్ కొరతను వాళ్లిద్దరూ తీర్చుతారు: గంగూలీ
- 2011 తర్వాత వరల్డ్ కప్ నెగ్గని భారత్
- కీలక మ్యాచ్ ల్లో తేలిపోతున్న స్టార్ ఆటగాళ్లు
- ఈసారి సొంతగడ్డపై వరల్డ్ కప్ టోర్నీ
- ఇది మంచి అవకాశం అంటున్న గంగూలీ
- ఒత్తిడి అనేది సమస్య కానేకాదని స్పష్టీకరణ
టీమిండియా ఓ ఐసీసీ టైటిల్ నెగ్గి 12 ఏళ్లు కావొస్తోంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ నెగ్గాక, టీమిండియా ఇప్పటిదాకా మరో ఐసీసీ ఈవెంట్ లో విజేతగా నిలవలేదు. జట్టులో హేమాహేమీ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, కీలక మ్యాచ్ ల్లో చేతులెత్తేయడం భారత జట్టుకు అలవాటుగా మారింది.
ఇప్పుడు టీమిండియా ముందు ఓ మంచి అవకాశం నిలిచింది. అక్టోబరు 5 నుంచి భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ జరగనుంది. సొంతగడ్డపై ఈ టోర్నీ జరుగుతుండడం టీమిండియాకు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో, మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందించాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంబినేషన్లో టీమిండియా టైటిళ్ల కరవు తీరనుందని అన్నాడు. సొంతగడ్డపై జరగనున్న మెగా టోర్నీలో రోహిత్ శర్మ, ద్రావిడ్ జోడీ భారత్ ను విజేతగా నిలుపుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
"అత్యున్నత స్థాయి క్రికెట్లో ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. గత వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ 5 సెంచరీలతో సత్తా చాటాడు. అప్పుడు కూడా ఎంతో ఒత్తిడి నడుమ గంగూలీ ఈ సెంచరీలు నమోదు చేశాడు. అందుకే ఒత్తిడి అనేది సమస్య కాదనుకుంటున్నాను. ద్రావిడ్ ఆటగాడిగా కొనసాగిన సమయంలోనూ ఒత్తిడి ఉంది. ఇప్పుడు ద్రావిడ్ హెడ్ కోచ్ అయ్యాడు. కోచ్ గానూ అతడిపై ఒత్తిడి ఉంటుంది. అది పొమ్మంటే పోయేది కాదు.
కానీ ఒత్తిడే సమస్య అని భావించడంలేదు. రోహిత్, ద్రావిడ్ జోడీ టీమిండియాను విజేతగా నిలపడానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తారని భావిస్తున్నాను. రోహిత్ కు కెప్టెన్ గా ఎంతో అనుభవం ఉంది. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ను ఐదుసార్లు చాంపియన్ గా నిలిపాడు. ఇదే రీతిలో భారత్ ను కూడా ప్రపంచ విజేతగా నిలుపుతాడని ఆశిస్తున్నాను" అని గంగూలీ వివరించాడు.